రాష్ట్రంలో ఎక్కడా లేని వింత రూల్స్ చిత్తూరు డీడీ కార్యాలయంలోనే తెరపైకి వస్తాయి. కొత్త కొత్త రూల్స్‌ను తెరపైకి తెస్తూ చిత్తూరు ట్రెజరీ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల పేరుతో టీచర్లను రకరకాలుగా వేధిస్తున్నారు. తెరవెనుక ముడుపులు ముట్టజెబితేనే ఫైళ్లు ముందుకు కదిలేలా ట్రెజరీ అధికారులు చక్రం తిప్పుతున్నారనే విమర్శలు బహిరంగానే వినిపిస్తున్నాయి. ఒకవైపు హైస్కూల్ ప్లస్ టీచర్లు కుటుంబ పోషణకు, ఈఎంఐల చెల్లింపుకు నానా అవస్థలు పడుతున్నారు. ఖజానా శాఖ అధికారులు మాత్రం తమ అక్రమ నిబంధనలతో కాలయాపన చేస్తుండటం పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా రాష్ట్ర స్థాయి అధికారులు, ఆర్థిక శాఖ తక్షణమే జోక్యం చేసుకుని కలెక్టర్ ఆదేశాలు ధిక్కరిస్తున్న ఆ అధికారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మూడు నెలలుగా నిలిచిపోయిన హైస్కూల్ ప్లస్ టీచర్ల జీతాలను తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నారు.


