కాణిపాకం: కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి స్వామివారు మహాగజ వాహనంపై కొలువుదీరి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. భక్తులు విఘ్న వినాశకుని మంగళరూపాన్ని తిలకించి పరవశించిపోయారు. వేకువజామునే మూలమూర్తికి విశేష పూజలు ప్రారంభమయ్యాయి. సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా తిరుమంజనం చేశారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
గజవాహనంపై కొలువుదీరిన గణాధిపతి
స్వామివారికి రాత్రి అలంకార మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు, ఉభయదారులు ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లి, మహాగజ వాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాటాలు, జానపద నత్యాలు. పలు ఆధ్యాత్మిక సాంస్కతిక ప్రదర్శనల నడుమ గజవాహన సేవ అత్యంత అంగరంగ వైభవంగా, నేత్రపర్వంగా సాగింది. పురవీధుల్లో స్వామివారు విహరిస్తుంటే ఓం శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః జై గణేశా అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో కాణిపాక క్షేత్రం మారుమోగింది.


