సాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్తూరు జిల్లా కేంద్రంలో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు, స్కానింగుల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఆడో.. మగో చెప్పి రూ.వేలకు వేలు గుంజుతున్న ఈ ముఠా వెనుక కూటమికి చెందిన ఓ కీలక బీసీ నేత ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఆ కార్యాలయాన్నే ఈ అక్రమ స్కానింగ్ సెంటర్‌కు ప్రధాన అడ్డాగా మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టానికి, పోలీసులకు భయపడాల్సిన చోట.. ఏకంగా అధికార పార్టీ నేత ఆఫీసులోనే ఈ దందా సాగుతుండడం గమనార్హం.
కమీషన్ల కోసం కోవర్టులు
ఈ అక్రమ ముఠా అత్యంత ప్రణాళికతో, విస్తృతమైన నెట్‌వర్క్‌తో పనిచేస్తోంది. గ్రామాలు, స్థానిక ప్రాంతాల్లో ఏజెంట్లుగా ఉండే కోవర్టుల ద్వారా గర్భిణులను గుర్తిస్తున్నారు. వారికి రకరకాల ఆశలు చూపి, తమ ఆటోల ద్వా రా నేరుగా సదరు బీసీ నేత కార్యాలయానికి తరలిస్తున్నా రు. అక్కడ ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా, రహస్యంగా స్కానింగ్ పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది. కడుపులో ఉన్నది ఆడపిల్లా లేక మగపిల్లా అని నిర్ధారించి చెప్పడానికి ఏకంగా రూ.17 వేలు వసూలు చేస్తున్నారు. రోజు కు పదుల సంఖ్యలో గర్భిణులను తీసుకొచ్చి ఈ దందా నడిపిస్తూ అక్రమార్కులు కాసుల వర్షంలో తడుస్తున్నారు.
పాత నిందితులు ఉన్నా సరే...
గతేడాది చిత్తూరు నగరంలోని లక్ష్మీనగర్‌కాలనీలో జరిగిన అక్రమ స్కానింగ్ దందాపై జిల్లా కలెక్టర్ స్వయంగా దాడి చేసి, విచారణ జరిపి బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో నిందితులుగా ఉన్న కొందరు కన్నుగప్పి మళ్లీ తెరపైకి వచ్చారనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ దందాకు పాత నిందితులు, ఓ కానిస్టేబుల్, ఓ మెడికల్ షాప్ నిర్వాహకుడు గ్యాంగ్‌గా ఏర్పడ్డారనే విమర్శ లు వస్తున్నాయి. వీరికి సదరు కూటమి బీసీ నేత తోడు కావడంతో చిత్తూరు నడిబొడ్డున మళ్లీ ఈ పాపపు వ్యాపారాన్ని ప్రారంభించారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
టచ్ చేసే దమ్ము ఎవరికుంది?
కూటమి నేత ఇచ్చిన పొలిటికల్ అభయంతోనే ఈ అక్రమార్కులు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారని ఈ అక్రమల చిట్టా తెలిసిన కొందరు వ్యక్తులు ఈ అక్రమాలను బహిరంగం చేస్తున్నారు. అధికారుల దాడి భయం లేకుండా, ఎవరైనా అధికారులు వచ్చి అడ్డొస్తే అన్నీ నేను చూసుకుంటా.. రాష్ట్ర స్థాయిలో ఒక్క ఫోన్ కాల్ కొట్టిస్తే చిత్తూరులో మమ్మల్ని తాకే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదంటూ ఆ నేత భరోసా ఇవ్వడంతో, ఈ ముఠా బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
వెంటనే చర్యలు తీసుకోకుంటే తీవ్ర ముప్పు
నగరంలో యథేచ్ఛగా సాగుతున్న ఈ అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యల దందాపై జిల్లా యంత్రాంగం, ఆరోగ్య శాఖ, సీఐడీ పోలీసులు స్పందించాల్సిన అవసరం ఉంది. అధికార పార్టీ నేత నీడన సాగుతున్న ఈ రాకెట్‌ను వెంటనే అణచివేయకపోతే జిల్లాలో ఆడపిల్లల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టే ప్రమాదముందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ అక్రమ స్కానింగ్ గ్యాంగ్‌ను, వారికి కొమ్ము కాస్తున్న కూటమి నేతను, సహకరిస్తున్న పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ప్రజా ప్రతినిధిని కలవాలన్నా భయమే
ఈ అక్రమ దందాకు లొంగని వారిపై, ఎదురు తిరిగిన వారిపై ఈ ముఠా వేధింపుల పర్వానికి తెరలేపింది. ప్రశాంత్ నగర్‌లో స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు ఓ మహిళను టార్గెట్ చేసి ఆమెను ఆ నేత తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కొందరు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్ర మ కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తున్నారని బాధిత మహిళలు వాపోతున్నారు. ఈ దందాలు, వేధింపులపై స్థానిక ప్రజాప్రతినిధిని కలిసి ఫిర్యాదు చేద్దామని బాధిత మహిళలు ప్రయత్నించినప్పటికీ.. కూటమి నేతల బెదిరింపులు, ఎమ్మెల్యే వద్దకు వెళితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోననే భయాందోళనల కారణంగా వెనక్కి తగ్గాల్సి వచ్చిందని సమాచారం.


