భజే హం.. గణేశం | - | Sakshi
Sakshi News home page

భజే హం.. గణేశం

Sep 16 2026 4:07 AM | Updated on Sep 16 2026 4:07 AM

● కాణిపాకంలో వైభవంగా చవితి సంబరాలు ● ధ్వజారోహణంతో ప్రారంభమైన వరసిద్ధుని బ్రహ్మోత్సవాలు ● పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు

శాస్త్రోక్తంగా

ధ్వజారోహణం

బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ ధ్వజస్తంభానికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. మూషిక చిత్రపటాన్ని ధ్వజస్తంభంపైకి ఎగురవేశారు. ముక్కోటి దేవతలను ఉత్సవాలకు ఆహ్వానించారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారు హంసవాహనంపై విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు.

కాణిపాకం : కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో చవితి పర్వదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. అలాగే మంగళవారం వార్షిక బ్రహ్మోత్సవాలను కనులపండువగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని విద్యుద్దీపాలు, పుష్పాలంకరణలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. పర్వదినం రోజున శాస్త్రోక్తంగా మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం జరిపించారు. దివ్యాభరణాలతో స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మూలవర్లకు ప్రత్యేక అభిషేకాలు, అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు., ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా సర్వదర్శన సేవలు అందించారు. అలాగే క్యూలో వేచి ఉన్న భక్తులకు ఆలయ అధికారులు తాగునీరు, ఉచిత ప్రసాదాలు పంపిణీ చేశారు. వందలాది మంది భక్తులు స్వామివారికి పుష్పకావళ్లను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తొలి రోజు రాత్రి ఉత్సవమూర్తి మూషిక వాహనంపై పురవీధుల్లో విహరించారు.

పట్టువస్త్రాల సమర్పణ

వార్షిక బ్రహ్మోత్సవాలు, వినాయక చవితిని పురస్కరించుకుని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వం తరఫున స్వామివారికి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలను సమర్పించారు. కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎస్పీ తుషార్‌డూడి, ఎమ్మెల్యేలు మురళీమోహన్‌, గురజాల జగన్‌మోహన్‌, ఆలయ ఈఓవో పెంచల కిషోర్‌, చైర్మన్‌ మణినాయుడు పాల్గొన్నారు.. అనంతరం ప్రత్యేకంగా చేపట్టిన గణపతి వ్రతానికి మంత్రి హాజరయ్యారు.

స్వర్ణ రథోత్సవ సేవ ప్రారంభం

శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో భక్తుల కోసం నూతనంగా స్వర్ణ రథోత్సవ ఆర్జిత సేవను ప్రవేశపెట్టినట్లు ఈఓ పెంచల కిషోర్‌ తెలిపారు. ప్రతి సంకటహర గణపతి వ్రతం రోజున ఈ సేవ అందుబాటులో ఉంటుందన్నారు. రూ.5వేల టికెట్‌పై గరిష్టంగా ఐదుగురు భక్తులను అనుమతిస్తామని వెల్లడించారు. పూజా సామగ్రిని ఆలయమే సమకూరుస్తుందని, భక్తులకు సిల్క్‌ శాలువా, జాకెట్‌ పీస్‌, రెండు అభిషేకం లడ్డూలు, రెండు వడలను ప్రసాదంగా అందిస్తామని వివరించారు. ఆన్‌లైన్‌ ద్వారా భక్తులు స్వర్ణ రథోత్సవం టికెట్లు పొందవచ్చని తెలిపారు.

ఊరేగుతున్న స్వామివారు

మూషిక వాహనంపై వినాయకుడు

స్వయంభు.. నీ సన్నిధే మాకు పెన్నిధి. సకల దేవతాగణాలు పూజనీయమైన సుమ పాద పద్మాలే మాకు శరణ్యం. మూషిక వాహనంపై కొలువుదీరిన నీ దివ్య చరణాలే సర్వజగద్రక్ష.. అంటూ అశేష భక్త జనులు స్మరించుకున్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని సోమవారం కాణిపాకం క్షేత్రానికి భారీగా తరలివచ్చారు. శోభాయమానంగా వెలుగొందుతున్న పార్వతీతనయుడిని దర్శించుకుని పులకించారు. మంగళవారం వైభవంగా ప్రారంభమైన వరసిద్ధుని బ్రహ్మోత్సవంలో గణనాథుని సేవించుకుని పరవశించారు.

ఆలయాల అభివృద్ధే ధ్యేయం

రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 6,254 ఆలయాల్లో ధూప దీప నైవేద్య పథకం కింద ఏటా రూ.75 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు.సీజీఎఫ్‌ ద్వారా 767 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.908.32 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. రూ.750 కోట్లతో 5వేల భజన మందిరాల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 1,788 మందిరాలకు నిధులు విడుదల చేశామని వివరించారు. 111 ఆలయాల్లో ఏటా రూ.3 కోట్ల మందికి అన్నదానం చేస్తున్నామని తెలిపారు. పాలనా సౌలభ్యం కోసం 996 ఆలయాలకు ట్రస్ట్‌ బోర్డుల నియామకం పూర్తి చేశామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement