గంగాధరనెల్లూరు: మండలంలోని తూగుండ్రం పంచాయతీ బాలయ్య కొత్తూరు వద్ద బైక్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. పాలసముద్రం మండలం రంగాపురం గ్రామానికి చెందిన గుణశేఖర్ మంగళవారం ద్విచక్రవాహనంపై వెళుతుండగా ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన గుణశేఖర్ గంటకు పైగా రక్తస్రావంతో ప్రమాద స్థలంలోనే పడి ఉన్నా డు. స్థానికులు వెంటనే 108 వాహనానికి సమా చారం అందించినప్పటికీ, సమయానికి రాలేదు. ఆర్తనాదా లు చేస్తున్న క్షతగాత్రుడిని స్థానికులే ఓ ప్రైవేట్ వాహనంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. సకాలంలో 108 వచ్చి ఉంటే ప్రాణాలు కాపాడి ఉండవచ్చని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశా రు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 69,440 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36,255 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.75 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
నేడు టీటీడీ బోర్డు సమావేశం
తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం బుధవారం తిరుమలలో జరగనుంది. ఈ ఏడాది అధిక మాసం కారణంగా శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో.. భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లపై మండలి ప్రధానంగా చర్చించనుంది. సుమారు 50 అజెండా అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయి. లడ్డూ పోటులో అధనపు సిబ్బందిని నియమించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే డొనేషన్ పాలసీలో స్వల్ప మార్పులు చేసి.. నామినీని మార్చుకునే అవకాశం కల్పించే అంశంపై విధివిధానాలను పరిశీలించనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ కార్మికులకు టైమ్ స్కేల్ వర్తింపజేసే అంశంపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భక్తులకు కల్పిస్తున్న ప్రమాద బీమా మొత్తాన్ని పెంచే అంశంపైనా మండలి చర్చించనుంది.
రోడ్డు ప్రమాదంలో
ఐఐటీ విద్యార్థికి తీవ్ర గాయాలు
నాయుడుపేటటౌన్: రోడ్డు ప్రమాదంలో ఐఐటీ విద్యార్థి తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం మండలంలోని అయ్య ప్పరెడ్డిపాళెం క్రాస్ రోడ్డు చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన పవన్‌కుమార్ చైన్నెలో ఐఐటీ చదువుతున్నాడు. మంగళవారం చైన్నె నుంచి తన బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా మార్గమఽధ్యంలో అయ్యప్పరెడ్డిపాళెం గ్రామ జాతీయ రహదారి కూడలి వద్ద ఓ యాచకుడు అడ్డు రావడంతో బైక్ అతనిని ఢీకొంది. ఈ ప్రమాదంలో పవన్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే యాచకుడు చెంచయ్యకూ గాయాలయ్యాయి. ఇద్దరినీ 108 అంబులెన్సులో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పవన్‌ను నెల్లూరు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


