ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Sep 9 2026 12:23 AM | Updated on Sep 9 2026 12:23 AM

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్యచౌదరి, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్‌ 15 నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలు, ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపా రు. కాగా, ఆలయంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తయిన తర్వాత నామకోపు, చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు. పలువురు బోర్డు సభ్యులు, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో భాస్కర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement