కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. ఉత్సవ ఏర్పాట్లపై శనివారం. కాణిపాకంలోని ఆలయంలో ఎస్పీ తుషార్ డూడి, ఎమ్మెల్యే మురళీమోహన్, ఈఓ పెంచలకిషోర్, చైర్మన్ మణి నాయుడుతో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు నిరంతర సేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఆలయానికి వచ్చే దారిలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి నివారణకు ఆలయ నిధులతోనే శాశ్వత లైటింగ్ పనులు చేపట్టాలని ఆదేశించారు. తాగునీటి ట్యాంకుల క్లీనింగ్ అంశంలో నాణ్యత పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెలా కచ్చితంగా ట్యాంకులను శుభ్రం చేసి రికార్డులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ కాణిపాకంలోని ప్రతి ప్రాంతం సీసీ కెమెరాల నిఘా నీడలో ఉండేలా చూడాలని సూచించారు. బ్రహ్మోత్సవాలలో ప్రతిఒక్కరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని కోరారు. పండితులు ఎలాంటి ఆలస్యం లేకుండా వైదిక కై ంకర్యాలు, సేవలను సకాలంలో ప్రారంభించాలని చెప్పారు. సమావేశంలో ఆర్‌డీఓ శ్రీనివాసులు, డీఎంహెచ్‌ఓ నాగ శశిభూషణ్ రెడ్డి, డీటీసీ నిరంజన్ రెడ్డి, డీఈఓ సాగర్ బాబు, డీఎస్పీ సత్యనారాయణ, సీఐ శ్రీధర్ నాయుడు, ఎస్‌ఐ నరసింహులు, ఏఈఓలు రవీంద్రబాబు, ఎస్వీ కృష్ణారెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.


