ప్రకృతి సంపదను దోచేస్తున్న టీడీపీ నేతలు రాత్రివేళ సరిహద్దులు దాటుతున్న గ్రానైట్ రాళ్లు మామూళ్ల మత్తులో మైనింగ్ అధికారులు రూ.కోట్లకు పడగలెత్తుతున్న అక్రమార్కులు
బాబు మాట..
నీటి మూట
అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని వేదికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే మాటలు నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి. మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు. చివరకు టీడీపీ నాయకులే ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ క్వారీలపై చర్యలు తీసుకోకపోతే ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రకృతి సంపదను యథేచ్ఛగా దోచేసుకుంటున్నారు. అందులో భాగంగా జిల్లాలో యథేచ్ఛగా క్వారీలను అక్రమంగా నిర్వహిస్తున్నారు. కొండలు.. గుట్టలను పగులగొట్టి రాళ్లను అమ్మేసుకుంటున్నారు. ప్రధానంగా గ్రానైట్‌ను కొల్లగొట్టి రూ.కోట్ల పోగేసుకుంటున్నారు. అక్రమార్జనే లక్ష్యంగా అత్యంత విలువైన నల్లబంగారం బ్లాక్‌లను సరిహద్దులు దాటించేస్తున్నారు. అడ్డుకోవాల్సిన మైనింగ్‌శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. కళ్లెదుటే కొండలు కరిగిపోతున్నప్పటికీ మీనమేషాలు లెక్కిస్తున్నారు.
పూతలపట్టు మండలంలోని అక్రమ క్వారీ
సాక్షి టాస్క్‌ఫోర్స్ : జిల్లాలో పచ్చనేతల దోపిడీ పరాకాష్టకు చేరింది. అధికారం అడ్డు పెట్టుకుని ప్రకృతి సంపదను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. కొండలు, గుట్టలను అప్పడాల్లా కరకరలాడించేస్తున్నారు. ఒకప్పుడు ఖాళీ జేబులతో తిరిగిన వాళ్లు కూడా చూస్తుండగానే రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. అధికారులు మాత్రం అక్రమ రవాణాకు గప్‌చుప్‌గా కాపలా కాస్తున్నారు.
యథేచ్ఛగా తవ్వకాలు
జిల్లాలోని పలు మండలాల్లో అక్రమ మైనింగ్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. పూతలపట్టు నియోజకవర్గలో మూడు అక్రమ క్వారీలు పచ్చ నేతలకు ప్రధాన ఆదాయవనరుగా మారిపోయాయి. ఐరాల మండలంలోని బొమ్మసముద్రంతో పాటు యాదమరిలోని దాసరపల్లె, గొల్లపల్లె, తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో దర్జాగా క్వారీలు నడుపుతున్నారు. బంగారుపాళ్యం మండలంలోని పాలేరు, కణతల చెరువు ప్రాంతాల్లో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. చిత్తూరు మండలంలోని పెద్దిశెట్టిపల్లె, నాయనిచెరువులోని ప్రభుత్వ రెవెన్యూ భూముల్లో అనధికారికంగా గ్రానైట్ మైనింగ్ సాగిస్తున్నారు. జీడీనెల్లూరు, ఎస్‌ఆర్ పురం, వెదురుకుప్పం మండలాల్లో బహిరంగంగానే కొండలను పిండి చేసేస్తున్నారు.
కప్పం కడితేనే పనులు!
జిల్లాలో మొత్తం 650 మైనింగ్ లీజులుండగా, వాటిలో 520 గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అధికారికంగా 260 చోట్ల తవ్వకాలు జరుగుతుంటే, 130కు పైగా అనధికారిక క్వారీలు మైనింగ్ సాగిస్తున్నాయి. గతంలో ఐరాల–పూతలపట్టు సరిహద్దుల్లోని ఒక క్వారీని కూటమికి చెందిన ఒక నాయకుడు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకోవడంతో, అసలు లీజుదారుడు దిక్కుతోచక కన్నీరుమున్నీరవుతున్నాడు. రాయి కొట్టాలన్నా, లారీకి ఎత్తాలన్నా పచ్చ నేతలకు కప్పం కట్టాల్సిందే. మండలానికి ఒకరిని ఏజెంట్‌గా పెట్టుకుని నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. వినకపోతే రాజకీయ ఒత్తిడితో పనులు నిలిపివేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఇటీవల జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాట్ల ఖర్చుల పేరుతో మండలాల వారీగా క్వారీ యజమానుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి పంచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో ఇష్టారాజ్యంగా అక్రమ క్వారీలు


