ఆఫీస్‌లను తరలించడమే పురోగతా? వాణిజ్యపన్నులశాఖ కార్యాలయం మారిస్తే ఊరుకోం గత వైఎస్సార్‌సీపీ పాలనలో ఎక్స్‌ప్రెస్ హైవే చంద్రబాబు ప్రభుత్వంలో చిత్తూరుకు మోసం విజయానందరెడ్డి ఆగ్రహం
చిత్తూరు కార్పొరేషన్ : గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లా అభివృద్ధి పథంలో పయనించిందని, చంద్రబాబు పాలన వచ్చిన తర్వాత అధోగతి పాలవుతోందని వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మండిపడ్డారు. ప్రధానంగా చిత్తూరు నుంచ అన్ని కార్యాలయాలను తిరుపతికి తరలించేస్తూ.. అదే అభివృద్ధి అన్నట్లు కలరింగ్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నగరలోని వాణిజ్యపన్నులశాఖ కార్యాలయం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వాణిజ్యపన్నులశాఖ జేసీ, డీసీ కార్యాలయాలను తిరుపతికి మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. కార్యాలయ మార్పు వద్దని సంబంధితశాఖ ఉద్యోగులు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌కు విన్నవిస్తే, ‘‘ఆర్థికశాఖ మంత్రి కేశవన్న నా ఫ్రెండ్ అవసరమైతే గొడవ పడి అయినా అపుతా’’ అని హామీ ఇచ్చి ఇప్పుడు ఏమయ్యాడని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున సమస్యను ఎమ్మెల్యే అక్కడ ప్రస్తావించి కార్యాలయాల తరలింపును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలోని ఆశాఖ కార్యాలయం చిత్తూరు, తిరుపతి జిల్లాలకు దగ్గరగా ఉందన్నారు. వ్యాపారులకు పన్ను, జరిమానా చెల్లింపులు ఇతర సందేహాల నివృత్తి కోసం చిత్తూరుకు త్వరగా వచ్చేవారని చెప్పారు. కుప్పం నుంచి వ్యాపారులు తిరుపతి వెళ్లి రావాలంటే 370 కిలోమీటర్లు ప్రయాణించాలన్నారు. 50 మంది ఉద్యోగులు తిరుపతి పోవాలంటే వారి పిల్లల చదువులు, ఇంటి అడ్వాన్స్‌లు, ఇతర సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు ఎకై ్సజ్ డీసీ కార్యాలయాన్ని సైతం తిరుపతికి తరలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యాలయాలు తరలిపోకుండా సీపీఐ, సీపీఎం నేతలు, మేధావులు కలిసి వచ్చి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వాణిజ్య పన్నులశాఖ కార్యాలయం తిరుపతికి తరలిస్తే వ్యాపారులు ఇబ్బంది పడతారని మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్ తెలిపారు.
నిరసన ర్యాలీ
వాణిజ్యపన్నులశాఖ కార్యాలయం నుంచి వివేకానందుని విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. విజయానందరెడ్డి మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కేంద్రం సాయంతోనే చిత్తూరు– తచ్చూరు, చైన్నె– బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే మంజూరు చేయించామన్నారు. సీఎంసీ ఆస్పత్రిని గుడిపాలలో అభివృద్ధి చేశామని వెల్లడించారు. చంద్రబాబు మూయించిన విజయ డెయిరీని అమూల్ సంస్థకు ఇచ్చిన జగనన్న పునఃప్రారంభించారన్నారు. చిత్తూరు–తిరుపతి రోడ్డు అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. మహిళ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి, జిల్లా లీగల్ విభాగం అధ్యక్షుడు సూర్యప్రతాప్‌రెడ్డి, నేతలు ప్రకాష్, రజనీకాంత్, అప్పొజీ, రమణ, చాన్‌బాషా, అను, మధుసూదన్, త్యాగ, అమర్‌నాథరెడ్డి, రమణ, అంజలిరెడ్డి, భాగ్యలక్ష్మిరెడ్డి, హరీషారెడ్డి, పూంగొడి, మనోహర్‌రెడ్డి, నారాయణ, మనోజ్‌రెడ్డి, సద్దాం, శివ, మురళీరెడ్డి, చక్రీ, రాజేష్‌రెడ్డి, శేఖర్, రూపేష్‌రెడ్డి, ప్రతిమారెడ్డి, సయ్యద్, డేవిడ్, అజిత్ పాల్గొన్నారు.


