వి.కోట: మండల కేంద్రమైన వి.కోట గ్రామ పంచాయితీ కార్యాలయంలో వాటర్‌మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్న తిప్పన్న కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రాణపాయ స్థితిలో బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కిడ్నీ మార్పిడి చేయాలని, అందుకు రూ. లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు పేర్కొన్నట్టు కుటుంబ సభ్యులు వాపోయారు. తమ కు అంత ఆర్థిక స్థోమత లేదని, దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.
పాల వ్యాను ఢీకొని వ్యక్తి మృతి
గంగవరం: మండలంలోని తిరుమల డెయిరీ సమీపంలో బుధవారం రాత్రి పాలవ్యాను ఢీ కొని ద్విచక్ర వాహనదారుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. పలమనేరు పట్టణంలోని కంసల వీధిలో నివాసం ఉంటున్న సురేష్(37) గంగవరం మండలంలోని గండ్రాజుపల్లి వద్ద ఉన్న కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. కంపెనీలో పని ముగించుకు ని బుధవారం రాత్రి ఇంటికి బయలుదేరాడు. తిరుమల డెయిరీ సమీపంలో వస్తుండగా పాల వ్యాను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన సురేష్ ను పోలీసులు చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ సభ్యులకు
వృద్ధురాలి అప్పగింత
పెనుమూరు(కార్వేటినగరం): తప్పిపోయిన వృద్ధురాలిని పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మండలంలోని చిప్పారపల్లికి చెందిన టీ.సరోజమ్మ(68) ఈ నెల 2వ తేదీన కనిపించకపోయింది. ఆమె చిన్న కుమారుడు పవన్ కళ్యాణ్ గురువారం పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు చిత్తూరు ఎస్‌డీపీవో జె.వెంకటనారాయణ పర్యవేక్షణలో చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ సీఐ కె.రామచంద్ర ఆధ్వర్యంలో పెనుమూరు ఎస్‌ఐ శ్రీనివాసులు, వారి సిబ్బంది బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. పెనుమూరు బస్టాండు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. సరోజమ్మ పెనుమూరు నుంచి చిత్తూరు చేరుకుని అక్కడి నుంచి కాణిపాకం వెళ్లినట్లు గుర్తించారు. కాణిపా కం శ్రీవరసిద్ది వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆమెను పెనుమూరు తీసుకువచ్చారు.విచారణలో ఆమె ఐదు రోజులు స్వామి వారి సన్నిధిలో ఉండి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చినట్టు తెలిపారు. అనంతరం ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
స్కూల్ వ్యాన్ డ్రైవర్‌పై
ఆకతాయిల దాడి
యాదమరి: మండల కేంద్రంలోని ఐఓసీఎల్ సమీపంలో గురువారం సాయంత్రం కొందరు ఆకతాయిలు మద్యం మత్తులో బీభత్సం సృష్టించారు. చిత్తూరు నుంచి యాదమరి వైపు పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఓ వ్యాన్‌ను ఓవర్‌టేక్ చేయబోయిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనం నుంచి కిందపడిపోయారు. తాము కింద పడడానికి బస్సు డ్రైవరే కారణమని ఆగ్రహంతో ఊగిపోయారు. స్కూల్ వ్యాన్‌ను అడ్డుకున్నారు. వ్యాన్ అద్దాలను ధ్వంసం చేయడమే కాకుండా, డ్రైవర్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి యత్నించారు. బస్సు లోపల ఉన్న చిన్నారులు భయాందోళనకు గురై కేకలు వేశారు. దీన్ని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని ఆకతాయిలను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ మధ్య కాలంలో కొందరు ఆకతాయిలు విద్యార్థులు ప్రయాణించే వాహనాలను వెంబడించడం, వేధించడం చేస్తున్నారని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో యాదమరి బస్టాప్ వద్ద స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులను వేధిస్తున్నారని పేర్కొన్నారు. బస్టాప్ వద్ద పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.


