ఆన్‌లైన్ సేవలు.. ‘మన మిత్ర’ నిధులు ఆలయ ఖాతాకు ఏవీ?
దేవాదాయ శాఖ కమిషనర్ ఖాతాకు ఎందుకు మళ్లిస్తున్నారు
గంటల తరబడి నిధులు హోల్డ్‌లో పెట్టడం వెనుక మతలబు ఏమిటి?
పారదర్శకతకు పూడ్చలేని గండి..
భక్తజనం నిలదీత
కాణిపాకం: కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి భక్తులు సమర్పించుకునే సేవా రుసుములకు దేవాదాయ శాఖ రెక్కలు తొడుగుతోంది. నగదు స్వామివారి ఆలయ ఖాతాలో జమ కాకుండా దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ ఖాతాకు మళ్లిస్తుండడంపై తీవ్ర దుమారం రేగుతోంది. దీనివెనుక ఉన్న అంతర్యమేమిటని భక్తులు, ఆలయ ఉభయదారులు దేవాదాయ శాఖ అధికారులను నిలదీస్తున్నారు.
రోజుకు వేల సంఖ్యలో భక్తులు
కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకునేందుకు సాధారణ రోజుల్లో 15 వేల మందికి పైగా, శని, ఆదివారాల్లో 30 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం దర్శనాలు, సేవల టికెట్ల విక్రయాన్ని వాట్సాప్ ఇ–గవర్నెన్స్, మన మిత్ర యాప్ ద్వారా డిజిటలైజ్ చేశారు. ఈ సేవల ద్వారా భక్తులు చెల్లించే సొమ్ము నేరుగా ఆలయ బ్యాంకు ఖాతాకు కాకుండా రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఖాతాకు చేరుతోంది. దీనిపై అధికారులు సరైన సమాధానాలు చెప్పడం లేదు.
నిధుల ఆగడాలు!
భక్తులు తమ మొబైల్స్ నుంచి మన మిత్ర ద్వారా చెల్లించే ప్రతి రూపాయి ముందుగా విజయవాడలోని దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ ఖాతాకు బదిలీ అవుతోంది. నేరుగా కాణిపాకం ఆలయ ఖాతాకే అనుసంధానించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ.. నిధులను వేరే ఖాతాకు మళ్లించడం వెనుక ఉన్న మతలబేంటో అర్థం కావడం లేదు. కమిషనర్ ఖాతాలోకి వెళ్లిన సొమ్ము కొన్ని గంటల తర్వాత గానీ ఆలయ ఖాతాలోకి రావడం లేదని ఆలయ అధికారులే అంగీకరిస్తుండడం గమనార్హం. ఆ కొన్ని గంటల పాటు స్వామివారి నిధులు ఇతరత్రా ప్రయోజనాలు ఎవరికి చేరుతున్నాయంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలకు నీళ్లొదిలేశారా?
ఏ దేవాలయానికై నా భక్తులు సమర్పించే కానుకలు, రుసుములు అదే క్షణంలో ఆయా దేవస్థాన అధికారిక ఖాతాలో జమ కావాలన్నది ప్రాథమిక నిబంధన. దేవాదాయ శాఖ మాత్రం ఈ నిబంధనలను బేఖాతరు చేస్తోంది. మా స్వామివారికి సమర్పించుకునే రుసుములు కమిషనర్ ఖాతాకు ఎందుకు పోవాలని భక్తులు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మన మిత్ర ద్వారా వచ్చే ప్రతి రూపాయి నేరుగా కాణిపాకం ఆలయ ఖాతాలోనే జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఈవో పెంచల కిషోర్‌ను వివరణ కోరగా.. అనుమానం పడాల్సిన అవరసరం లేదని, ఆ నిధులు 48 గంటల్లో ఆలయ ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.


