అక్రమంగా క్వారీ ఆక్రమణ! | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా క్వారీ ఆక్రమణ!

Aug 7 2026 2:02 AM | Updated on Aug 7 2026 2:02 AM

తుమ్మిందలో ప్రజాప్రతినిధి బంధువు హల్‌చల్‌

నిర్వాహకుడి నుంచి రూ.3 కోట్ల డిమాండ్‌

కలెక్టర్‌, రాష్ట్ర అధికారులకు బాధితుడి ఫిర్యాదు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: చిత్తూరు మండలం తుమ్మింద గ్రామంలో క్వారీ మాఫియా పంజా విసిరింది. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి బంధువు అక్రమ క్వారీ దందాను సాగిస్తుండడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అసలైన క్వారీ నిర్వాహకుడిని బెదిరించి, రూ.3 కోట్లు కప్పం కట్టాలని హుకుం జారీ చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సదరు నిర్వాహకుడు అంత ఇచ్చుకోలేనని తెగేసి చెప్పడంతో ఆ క్వారీని తమ గుప్పిట్లోకి తీసుకుని నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు, సొంత పార్టీ నేతలు కోడైకూస్తున్నారు. దీంతో బాధితులు జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. పది రోజుల క్రితం కలెక్టర్‌ ఆదేశాలతో క్షేత్రస్థాయికి వెళ్లిన స్థానిక అధికారులు విచారణ పేరిట కంటితుడుపు చర్యలు చేపట్టారు. అక్కడ ఎలాంటి అక్రమాలు జరగడం లేదంటూ క్లీన్‌ చిట్‌ ఇవ్వడం గమనార్హం. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవ్వడంతో రెండు రోజులుగా రాష్ట్ర స్థాయి అధికారులు సీక్రెట్‌గా విచారణ చేస్తున్నట్టు సమాచారం. తుమ్మిందలోనే కాకుండా పెద్దిశెట్టిపల్లి, నాయనిచెరువు పరిసర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో గ్రానైట్‌ అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ఈ దందా వ్యవహారం త్వరలోనే టీడీపీ అధిష్టానం వద్దకు చేరనున్నట్లు సమాచారం.

అధిష్టానం ముందు పెట్టేందుకు కసరత్తు

తుమ్మింద గ్రామంలో ఉన్న క్వారీని ఏడాది క్రితం నిలిపివేశారు. ఇటీవల క్వారీ మళ్లీ ప్రారంభమవుతున్నట్లు తెలిసి ఆ ప్రజాప్రతినిధి బంధువు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. రూ.3 కోట్లు డిమాండ్‌ చేసినట్టు తెలిసింది. కర్ణాటకకు చెందిన ఆ వ్యాపారి డీల్‌ను తోసిపుచ్చడంతోపాటు ఏమి చేసుకుంటారో చేసుకోవాలని సవాల్‌ విసిరినట్లు తెలిసింది. మరోవైపు ఆ వ్యాపారికి కూటమిలోని ఓ వర్గం నేతలు సపోర్ట్‌ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడెక్కడ ఎలా ఫిర్యాదు చేయాలో డైరెక్షన్‌ ఇస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారాల వల్ల ప్రభుత్వానికి తీవ్ర చెడ్డ పేరు వస్తోందనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలను జోడించి.. అధిష్టానం ముందు పెట్టేందుకు సొంత పార్టీ నేతలే రెడీ అవుతున్నట్లు స్పష్టమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement