– ప్రిన్సిపల్ సైంటిస్ట్ రామక్రిష్ణారావు
పలమనేరు: జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఈ కరు వులో పంటలను కాపాడుకోవడానికి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించడమే ఉత్తమమని తిరుపతిలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్ధానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ రామక్రిష్ణారావు తెలిపారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో పరిస్థితులను పరిశీలించేందుకు వ్యవసాయశాఖ బృందం గురువారం పలమనేరు మండలంలోని మొరం గ్రామంలో పర్యటించింది. వేరుశనగ పంటను పరిశీలించింది. ఆయన మాట్లాడుతూ వంద లీటర్ల నీటికి పది లీటర్ల జీవామృతాన్ని కలిపి పంటపై పిచికారీ చేయాలన్నారు. వాడిన పంటలపై యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయడంతో 20 రోజుల పాటు నీటి ఎద్దడి నుంచి పంటను కాపాడుకోచ్చునని తెలిపారు. ఇలాగే వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాగి, సజ్జ, మినుములు, పెసలు, జొన్న లాంటి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. ఇందులో కోఆర్డినేటర్ రామాంజినేయులు, స్థాబిక ఏడీ గీతాకుమారి, ఎస్వీ అగ్రికల్చర్ కళాశాల నుంచి క్రిష్ణారెడ్డి, రాజేష్, కార్తీక్‌రెడ్డి, స్థానిక ఏవో సంధ్య తదితరులు పాల్గొన్నారు.


