300 టన్నుల పేపర్ దగ్ధమైందా? విలువ రూ.35 లక్షలా? ఇన్సూరెన్స్ కోసం ఎత్తుగడా? ఆలస్యంగా వెలుగులోకి అనుమానాస్పద ఘటన
పుత్తూరు: పరమేశ్వరమంగళం పంచాయతీలోని కోలార్ పేపర్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (అట్టల ఫ్యాక్టరీ)లో ఈనెల 26వ తేదీ సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన వివరాలను అటు ఫ్యాక్టరీ యాజమాన్యం, ఇటు అగ్నిమాపక అధికారులు మీడియాకు తెలపక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేవలం ఇన్సూరెన్స్ క్లయిమ్ చేసుకోవడానికే ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రమాద ఘటనకు తెరతీసినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో పుత్తూరు నుంచి అగ్నిమాపక వాహనం వెళ్లి మంటలను అదుపు చేసినట్లు సమాచారం. అనంతరం ఫ్యాక్టరీ యాజమాన్యం 300 టన్నుల పేపర్ బండిల్స్ పూర్తిగా కాలిపోయినట్లు, విలువ సుమారు రూ.35 లక్షలు ఉంటుందని నివేదించినట్లు సమాచారం.
కార్మికుల ప్రాణాలకు భద్రత లేదు
కోలార్ పేపర్ మిల్‌లో పనిచేసే కార్మికుల ప్రాణాలకు భద్రత లేదని తెలుస్తోంది. ఫ్యాక్టరీలలో భద్రతా ప్రమాణాలను విధిగా ఏర్పాటు చేయాల్సి ఉన్నా అలాంటి ఏర్పాట్లు ఏమీ లేవని సమాచారం. దీంతో కార్మికుల ప్రాణాలతో పాటు పరిసర ప్రాంత ప్రజల భద్రత కూడా ప్రశ్నార్థకంగా ఉంది. అగ్నిమాపక శాఖ ఎన్‌ఓసీ గడువు ముగిసి ఏళ్లు గడుస్తున్నా దానిని పునరుద్ధరించకపోవడంతో యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. ఫ్యాక్టరీలో ఉండాల్సిన ఫైర్ ఎక్విప్‌మెంట్స్, వాటర్ లైన్స్, అత్యవసర స్పందన వ్యవస్థలు, భద్రతా ప్రమాణాలపై లోతైన తనిఖీలు చేపట్టాల్సి ఉంది. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఫైర్, రెవెన్యూ అధికారులు ఉమ్మడిగా ఈ ఫ్యాక్టరీలో తనిఖీలు చేపట్టి తగిన చర్యలు తీసుకోవల్సి అవసరం ఎంతైనా ఉంది..
మంటలను అదుపుచేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
ఫ్యాక్టరీకి ఎన్‌ఓసీ లేదు
పరమేశ్వరమంగళం సమీపంలోని కోలార్ పేపర్ మిల్స్‌కు అగ్నిమాపక శాఖకు సంబంధించి నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) లేదు. ఇదే ఫ్యాక్టరీలో ఈనెల 26వ తేదీన జరిగిన అగ్ని ప్రమాదంపై యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని, 300 టన్నుల పేపర్ బండిల్స్ కాలిపోయాయని, విలువ రూ.35 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.. అయితే ఫ్యాక్టరీ వారు ఎన్‌ఓసీని రెన్యూవల్ చేసుకోలేదు. పైగా ఇప్పుడే ఫైర్ ఎక్విప్‌మెంట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులు సైతం ఆదేశించారు. ఈ మేరకే ప్రభుత్వానికి తుది నివేదిక అందిస్తాం.
– నాగేశ్వరరెడ్డి,
ఇన్‌చార్జి ఫైర్ ఆఫీసర్, పుత్తూరు.
లెక్కలపై పలు సందేహాలు
ఫ్యాక్టరీలో పాత అట్టల ద్వారా తయారైయ్యే పేపర్ బండిల్స్ సాధారణంగా ఎక్కడ నిల్వ ఉంచుతారు? ఫ్యాక్టరీ గోడౌన్ బయట అగ్ని ప్రమాదం జరిగితే అక్కడ 300 టన్నుల పేపర్ బండిల్స్ ఎందుకు ఉన్నట్లు? వర్షం వస్తే తడవవా? ఎండకు ఎండిపోవా? అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? ఆరుబయట వేస్ట్ మెటీరియల్ మాత్రమే ఉంటుంది కదా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నిజంగా 300 టన్నుల పేపర్ నిల్వలు ప్రమాద సమయంలో అక్కడ ఉంటే వాటికి సంబంధించిన స్టాక్ రిజిస్టర్లు, రా మెటీరియల్ కొనుగోలు బిల్లులు, జీఎస్టీ రికార్డులు, గిడ్డంగి నిల్వల వివరాలను పరిశీలించాల్సి ఉంది.


