చంద్రగిరి: యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో ఆగస్టు 6 నుంచి 12 రోజులు మహిళలు, పురుషులకు అగరబత్తీల తయారీపై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగి తిరుపతి, చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 50 ఏళ్లలోపు మహిళలు, పురుషులు అర్హులన్నారు. 10వ తరగతి చదువుకుని ఉండాలని తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనంతో పాటు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువీకరణ పత్రాలు, టూల్‌కిట్టును ఇస్తామని తెలిపారు. శిక్షణ తీసుకోదలచిన వారు ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్, ఏదైనా ఎడ్యుకేషన్ ధ్రువీకరణ పత్రం జిరాక్స్ కాపీలు, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి వారి పేరు నమోదు చేయించుకోవాలని ఆయన కోరారు. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న ప్రాధాన్యతను ఇస్తామని వెల్లడించారు. వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11–48 ద్వారకానగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర) కొత్తపేట , చంద్రగిరి. ఫోన్: 79896 80587, 91775 43543, 63017 17672 నంబర్లను సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఉద్యోగోన్నతులపై ఆరోపణలు
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : ట్రాన్స్‌కో చిత్తూరు రూరల్ విభాగంలో చేపట్టిన ఉద్యోగోన్నతుల్లో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్‌ఆర్ వివరాల నమోదులో నిర్లక్ష్యం కనపడుతోందని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పలువురు ఉద్యోగులకు ప్రమోషన్స్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర జిల్లాలకు ఎప్పుడో బదిలీ అయిన ఉద్యోగులకు సైతం ఇక్కడ ప్రమోషన్లు ఇస్తున్నారని మండిపడుతున్నారు. అర్హులైన స్థానిక ఉద్యోగులకు మాత్రం రివర్షన్ ఇచ్చి అన్యాయం చేశారని విమర్శిస్తున్నారు. ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లను సరిగా పూర్తి చేయకపోవడంతో అకౌంట్స్ అధికారి తనిఖీకి వచ్చి వెనుతిరిగారని వెల్లడిస్తున్నారు. ప్రమోషన్ వచ్చినప్పటికీ ఆర్డర్లు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. సీఎండీ శివశంకర్ స్పందించి సమగ్ర విచారణ చేయించాలని కోరుతున్నారు.
పుత్తూరులో దుండగుల హల్‌చల్
పుత్తూరు: పది రోజుల క్రితం స్థానిక లక్ష్మీనగర్‌లోని ఓ ఇంట్లో దొంగలు పడి రూ.20 లక్షలు విలువైన బంగారు, వెండి నగలు దోచుకెళ్లారు. ఈ ఘటనను మరవక ముందే లక్ష్మీనగర్ కాలనీకి సమీపంలోని ఎస్బీఐ కాలనీలో మంగళవారం అర్థరాత్రి దుండగులు ఓ ఇంటి తలుపులు తట్టి హల్‌చల్ చేయడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. స్థానిక ఎస్బీఐ కాలనీలోని కె.సుబ్రమణ్యం అనే ఉపాధ్యాయుడు ఇంటి వద్ద దుండగులు హల్‌చల్ చేశారు. ఇంటి తలుపులు తట్టారు. నిద్రలేచి కిటికీ వద్దకు వచ్చి ఎవరూ అంటూ ప్రశ్నించగా సమాధానం ఇవ్వలేదు. వరండాలోని లైటు వేయగా నలుగురు వ్యక్తులు మారణాయుధాలతో కనిపించడంతో సుబ్రమణ్యం వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. ఇది గమనించిన దుండగులు అక్కడ నుంచి పరారయ్యారు. వెంటనే స్పందించిన ఎస్‌ఐ నాగేంద్రబాబు బృందం ఎస్బీఐ కాలనీ చుట్టు పక్కల గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే దుండగులు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు.
టీడీపీ నేత ఇంట్లో చోరీ
గంగాధర నెల్లూరు: మండలంలోని పెద్దకాలవ పంచాయతీ ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన టీడీపీ నేత లోకమ్మ ఇంట్లో మంగళవారం రాత్రి గుర్తుతెలయని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వివరాలు.. బాధితురాలు లోకమ్మ అర్ధగిరి ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లారు. ఆమె భర్త గోవిందరాజులు ఆర్‌టీసీ డ్రైవర్‌గా తన విధులకు వెళ్లిపోయారు. బుధవారం ఉదయం ఇంటికి వచ్చిన లోకమ్మ చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రూ.1.60లక్షల విలువైన బంగారు నగలు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మురుగేష్ తెలిపారు.
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
బంగారుపాళెం : స్థానిక బాలాజీ థియేటర్ సమీపంలోని టిఫిన్ సెంటర్‌లో సోమవారం బీరువాను పగులగొట్టి 16 గ్రాముల బంగారు నల్లపూసల దండను చోరీ చేసిన కేసులో నిందితుడిని బుధవారం సాయంత్రం అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టగా, చంద్రశేఖరపురానికి చెందిన పురుషోత్తమ్‌ను నిందితుడిగా గుర్తించామని, ముంగరమడుగు క్రాస్ వద్ద అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. నిందితుడి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.


