కిట్లలో నాసిరకం సంచులు! సర్ ప్రక్రియలో క్షేత్ర స్థాయి సిబ్బంది తీవ్ర అవస్థలు ఒక్కొక్కరు రెండు వేల ఫారాలు మోయాల్సి వస్తోంది
చిత్తూరు కలెక్టరేట్ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ అధికారులపై (బీఎల్‌వో) పనిభారం పెరిగింది. జిల్లా వ్యాప్తంగా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,511 మంది బీఎల్వోలు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి టోపీలు, గొడుగులు పంపిణీ చేసినట్లు పైకి ఆడంబరంగా ప్రకటిస్తున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముందే చిరిగిపోతున్నాయి!
భారాన్ని మోయడానికి ఎన్నికల సంఘం సరఫరా చేసిన బ్యాగులు అత్యంత నాసిరకంగా ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫారాల పంపిణీ ప్రక్రియ ప్రారంభంలోనే, బరువును తాళలేక ఈ బ్యాగులు చాలా వరకు డ్యామేజ్ అవుతున్నాయి. దారిలోనే సంచులు చిరిగిపోతుండడంతో ఫారాలను కాపాడుకోవడం సిబ్బందికి తలనొప్పిగా మారింది.
యాప్‌ల వేధింపులు
ఓటరు వివరాల డిజిటలైజేషన్ కోసం ఒక్కో ఇంటికి సుమారు మూడు నుంచి నాలుగు విడతలు తిరగాల్సి వస్తోందని బీఎల్‌వోలు చెబుతున్నారు. ఓటర్లు కలర్ ఫొటోలు ఇవ్వకపోతే, క్షేత్ర స్థాయిలోనే లైవ్ ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి రావడం అదనపు భారంగా మారింది. వర్షాకాలంలో గొడుగులు, రెయిన్ కోట్లు ఇచ్చినప్పటికీ.. సాంకేతిక లోపాలు, యాప్ స్కానింగ్ సమస్యలు, భారీగా ఉన్న ఫారాల కట్టలతో ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేయడం మానసిక వేదనకు గురిచేస్తోందని సిబ్బంది వాపోతున్నారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి తమపై ఉన్న పనిభారాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
బీఎల్‌వోలపై మోయలేని భారం
భారం మోయలేక తిప్పలు!
ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో అధికారులు అనుసరిస్తున్న విధానాలు బీఎల్‌వోలకు నరకం చూపుతున్నాయి. ఒక్కో బీఎల్‌వో సగటున 800 నుంచి వెయ్యి మంది ఓటర్లకు ఫారాలను పంపిణీ చేశారు. తర్వాత వాటిని సేకరిస్తున్నారు. ఇలా ప్రతి ఓటరుకు రెండేసి ఫారాల చొప్పున, ఒక్కొక్కరు సుమారు 1,600 నుంచి 2,000 ఫారాలను మోసుకుంటూ ఇళ్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కాగితాల కట్టలను మోయడం తమకు పెద్ద శ్రమతో కూడిన పనిగా మారిందని, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని బీఎల్వోలు వాపోతున్నారు.


