జిల్లాలో 91 శాతానికి చేరిన సర్ ప్రక్రియ 11.39 లక్షల మంది ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ పూర్తి మరో రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తికి చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో సర్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ తెలిపారు. ఆయన ఆదివారం కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో సర్ ప్రక్రియ అత్యంత వేగంగా, పారదర్శకంగా కొనసాగుతోందన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 13,40,126 మంది ఓటర్లకు సంబంధించి డిజిటలైజేషన్ ప్రక్రియ చేపట్టగా, ఇప్పటివరకు 11,39,840 మంది (84.37శాతం) ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. క్షేత్ర స్థాయి ధృవీకరణ ప్రక్రియతో కలుపుకుని జిల్లాలో మొత్తం 91 శాతం పురోగతి సాధించామన్నారు. మిగిలిన ప్రక్రియను మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు.
అర్హత లేని ఓట్లపై ప్రత్యేక నిఘా
క్షేత్ర స్థాయి పరిశీలనలో అర్హత లేని ఓటర్ల పై ప్రత్యేక నిఘా ఉందని కలెక్టర్ తెలిపారు. నిబంధనల ప్రకారం పూర్తిగా పరిశీలించిన అనంతరం మాత్రమే వీటిపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు నిర్వహించిన ప్రక్రియలో మృతి చెందిన ఓటర్లు దాదాపు 27 వేల మంది, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు 15 వేల నుంచి 16 వేల ఓటర్లు, డూప్లికేట్ ఓటర్లు 10 వేల మంది, చిరునామాతో లభ్యం కాని వారు దాదాపు 3 వేల మంది ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలోని 11,39,840 మంది ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు.
సంతకం తప్పనిసరి
సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు వారి కుటుంబ సభ్యులు సంబంధిత ఫారంపై తప్పనిసరిగా సంతకం చేయాలని కలెక్టర్ వెల్లడించారు. సంతకం చేయని పక్షంలో వారి పేర్లు రాబోయే ముసాయిదా ఓటరు జాబితాలో ఉండకపోవచ్చని స్పష్టం చేశా రు. ఇంకా సమయం ఉన్నందున, ఓటర్లు వెంటనే సంబంధిత బీఎల్‌వో, ఎన్నికల సిబ్బందిని సంప్రదించి ప్రక్రియను పూర్తి చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు సర్ ప్రక్రియపై ఎలాంటి నిర్దిష్ట ఫిర్యాదులు రాలేదని, ఒకవేళ ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత బీఎల్‌వో వివరాలతో జిల్లా ఎన్నికల అధికారికి అందజేస్తే తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.కాగా, జూలై 13, 14, 15 తేదీల్లో ఎస్‌ఐఆర్ పురోగతిపై వరుసగా వివరాలు విడుదల చేస్తామని కలెక్టర్ తెలిపారు.


