మాకొద్దు ఈ రౌడీ ఎమ్మెల్యే! శాంతియుత ర్యాలీకి పోలీసుల అడ్డంకులు | - | Sakshi
Sakshi News home page

మాకొద్దు ఈ రౌడీ ఎమ్మెల్యే! శాంతియుత ర్యాలీకి పోలీసుల అడ్డంకులు

Jul 7 2026 2:01 AM | Updated on Jul 7 2026 2:01 AM

● ఎస్పీ కార్యాలయం గేట్లు మూసివేత.. రోడ్డుపై బైఠాయింపు ● ప్లకార్డులు లాక్కుని, చొక్కాలు చించి, ఈడ్చుకెళ్లిన పోలీసులు ● ప్రజాస్వామ్య హక్కులు కాలరాశారని మోహిత్‌రెడ్డి ధ్వజం

● ఎస్పీ కార్యాలయం గేట్లు మూసివేత.. రోడ్డుపై బైఠాయింపు ● ప్లకార్డులు లాక్కుని, చొక్కాలు చించి, ఈడ్చుకెళ్లిన పోలీసులు ● ప్రజాస్వామ్య హక్కులు కాలరాశారని మోహిత్‌రెడ్డి ధ్వజం

ఎస్పీ కార్యాలయ ప్రధాన గేటు ఎదుట బైఠాయించిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు

‘చంద్రగిరిలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నా కనిపించవు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి బూతు మాటలు.. రోత పనులతో సీ్త్రలను కించపరుస్తున్నా వినిపించవు. అమాయక ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడడానికి మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తే తప్పయిపోయిందా..?. ఎస్పీని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న తమను అడ్డుకోవడం ఎంతవరకు సబబు..?. గేట్లు వేసి బయటకు తోసేయడం, చొక్కాలు చించేయడం, కార్యకర్తలను బూటుకాళ్లతో తన్నడం .. ఇదెక్కడి సంస్కృతి?..’ అంటూ వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త మోహిత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. ‘సేవ్‌ చంద్రగిరి..ఫ్రం పులివర్తి నాని’ పేరుతో సోమవారం చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌:చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి చేపట్టిన ర్యాలీకి పోలీసులు అడ్డంకులు సృష్టించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం చేపట్టిన ‘సేవ్‌ చంద్రగిరి.. ఫ్రం.. పులివర్తి నాని’ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. తిరుపతి జిల్లా ఎస్పీకి వినతిపత్రం ఇవ్వడానికి శాంతియుతంగా బయలుదేరిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలు, అడ్డంకులను అదిగమించిన కార్యకర్తలు, నాయకులు ఎట్టకేలకు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రధాన గేట్లను మూసివేయడంతో రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు నిరసనకారుల చేతుల్లోని ప్లకార్డులను లాక్కోవడం, నేతల చొక్కాలు చించి వేయడం, కాళ్లతో తన్నుతూ దురుసుగా వ్యవహరించడంతో నాయకులు, పోలీసుల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది.

చంద్రగిరిని కాపాడుకుంటాం

ఎమ్మెల్యే పులివర్తి నాని అవినీతి, అక్రమాలు, అరాచకాలు, ప్రశ్నించే వారిపై దాడుల నుంచి చంద్రగిరిని, ప్రజలను కాపాడుకుంటామని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు. పోలీసులు ఎస్పీని కలవడానికి కూడా అనుమతించకుండా గేట్లు మూసివేయడంతో రోడ్డుపై బైఠాయించిన ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ఒక బాధ్యతగల ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి బూతు మాటలు.. రోత పనులతో చంద్రగిరికి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని, కీర్తిని దిగజార్చుతున్నారని, చిత్తూరు రౌడీ సంస్కృతి తెచ్చిపెట్టారని, ఆ రౌడీ మూకల నుంచి అమాయక ప్రజలను కాపాడుకుంటామన్నారు.

డీఎస్పీ, అదనపు ఎస్పీ అత్యుత్సాహం

మోహిత్‌రెడ్డి ర్యాలీ ప్రారంభం నుంచే అదనపు ఎస్పీ రవిమనోహరాచారి, చంద్రగిరి డీఎస్పీ బేతంపూడి ప్రసాద్‌ అత్యుత్సాహం ప్రదర్శించారు. పార్టీ నేతలు, కార్యకర్తలపై విరచుకుపడ్డారు. ఎస్పీ కార్యాలయం లోపలికి వెళ్లకుండా బ్యారికేడ్లు పెట్టి పార్టీ క్యాడర్‌ను అదుపు చేశారు. ఆ వెంటనే స్పెషల్‌ పార్టీ పోలీసులను రంగంలోకి దించి రోప్‌లు వేసి బలవంతంగా వెనక్కునెట్టి కాళ్లతో తన్నుతూ విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు రెండు గంటల పాటు తోపులాట చోటుచేసుకుంది. చివరకు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

పలువురిపై కేసు

తిరుపతి క్రైం : జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన ఘటనలో వైఎస్‌ఆర్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డితో పాటు పలువురిపై ఎస్వీ యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఆలోచింపజేసిన ప్లకార్డులు

ఎమ్మెల్యే పులివర్తి నాని తీరును నిరసిస్తూ చంద్రగిరి వైఎస్‌ఆర్‌సీపీ తరఫున ముద్రించిన ప్లకార్డులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘సేవ్‌ చంద్రగిరి.. ఫ్రం.. పులివర్తి నాని.. మాకొద్దు.. మాకొద్దు.. ఆధ్యాత్మిక క్షేత్రంలో.. అరాచక సంస్కృతా..? బూతు మాటలు.. రోత పనులతో ఎమ్మెల్యే నాని అరాచకం.. కాపాడుతాం.. కాపాడుతాం..’ అంటూ ముద్రించిన ప్లకార్డులు అందరినీ ఆలోచింపజేశాయి.

మీవేనా కుటుంబాలు.. మావి కావా?

బూతులు మాట్లాడే ఎమ్మెల్యేలు తమ వద్ద లేరని, కుటుంబాల జోలికి వస్తే సహించమని సీఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ బహిరంగ సభలో ఊదరగొడతారని మోహిత్‌రెడ్డి చెప్పారు. ‘మీవేనా కుటుంబాలు.. మావి కావా..?’. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే పులివర్తి నాని మా కుటుంబంలోని మహిళలను గలీజు మాటలతో బాధపెడితే మీకు తప్పు అనిపించడం లేదా..? అని ఆయన ప్రశ్నించారు. బూతు మాటలతో ఒక రిటైర్డ్‌ జడ్జిని, వారి కుటుంబాన్ని దుర్భాషలాడిన ఎమ్మెల్యే నానిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement