విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతి

Jul 7 2026 2:01 AM | Updated on Jul 7 2026 2:01 AM

పెద్దపంజాణి: మండలంలోని అమ్మరాజుపల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలం వద్ద సోమవారం విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు.. అమ్మరాజుపల్లికి చెందిన హరినాథరెడ్డి భార్య పాడి ఆవును మేతకోసం వ్యవసాయ పొలం వద్దకు తోలుకుని వెళ్లింది. అక్కడ దాన్ని వదిలిపెట్టింది. ఈ క్రమంలో విద్యుత్‌ వైర్లు తెగి ఆవుమీద పడడంతో షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. పాడి ఆవు విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని హరినాథరెడ్డి కోరాడు.

కారు ఢీకొని వ్యక్తి మృతి

యాదమరి : మండలంలోని బెంగళూరు– చిత్తూరు జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి కారు ఢీకొనడంతో పాదచారి మృతి చెందాడు. ఎస్‌ఐ ఈశ్వర్‌ కథనం మేరకు... గాండ్లకొత్తూరుకు చెందిన శరవణ(48) ఆదివారం రాత్రి వ్యక్తిగత పనుల నిమిత్తం సమీపంలోని దుకాణానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరుకోవడానికి రోడ్డు దాటుతుండగా బెంగళూరు నుంచి చిత్తూరు వైపుగా వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో శరవణకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని స్థానికులు 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారికి సమీపంలో ఉండే గ్రామస్తులు రోడ్డు దాటే సమయంలో ఇరువైపులా వస్తున్న వాహనాలను గమనించి అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ విజ్ఞప్తి చేశారు.

నేడు కరెంటోళ్ల జనబాట

చిత్తూరు కార్పొరేషన్‌ : జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకోనున్నట్టు వెల్లడించారు. వాటిని దశల వారీగా పరిష్కరిస్తామని చెప్పారు.

రేపటి నుంచి

ఈసెట్‌ వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ

తిరుపతి సిటీ: యూజీ ఇంజినీరింగ్‌ కోర్సులలో నేరుగా సెకండ్‌ ఇయర్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈసెట్‌–2026 పరీక్షలలో ఉత్తీర్ణులైన వారు బుధవారం నుంచి వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. ఈ నెల 13వ తేదీ వరకు చివరి గుడువు కాగా 14న అప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. 20న సీట్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించి 21 నుంచి 25వ తేదీ లోపు సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలలో ప్రవేశాలు పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షకు జిల్లా నుంచి 1,463 మంది హాజరుకాగా 1,355 మంది అర్హత సాధించారు.

బంగారు గొలుసు చోరీ

తిరుపతి క్రైం: మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించిన ఘటన ఆదివారం రాత్రి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మునిరెడ్డినగర్‌లోని పీఎన్‌న్‌ ఆర్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న పార్వతి అనే మహిళ సమీపంలోని తన కుమార్తె ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా, ఆమె మెడలో ఉన్న సుమారు 36 గ్రాముల బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. క్రైమ్‌ డీఎస్పీ శ్యాంసుందర్‌ ఘటనా స్థలికి చేరుకుని పోలీసు సిబ్బందితో కలిసి పరిశీలించారు. బాధితురాలు పార్వతి ఫిర్యాదు మేరకు ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గోగుల కుటుంబంపై

పీడీ యాక్ట్‌

తిరుమల: తిరుమలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ భక్తులు, స్థానిక వ్యాపారులు, విధుల్లో ఉన్న పోలీసులు, భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తూ వరుస నేరాలకు పాల్పడుతున్న గోగుల కుటుంబ సభ్యులపై తిరుపతి జిల్లా పోలీసులు సోమవారం పీడీ యాక్ట్‌ను ప్రయోగించారు. పలుమార్లు అరెస్టు చేసినప్పటికీ వారి తీరులో మార్పు రాకపోవడంతో కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్‌ అమలు చేశారు. ఈ మేరకు గోగుల కోటయ్య అలియాస్‌ కోటి (22), గోగుల శ్రీనివాసులు అలియాస్‌ శ్రీను (20)ను పీడీ యాక్ట్‌ కింద అదుపులోకి తీసుకుని శ్రీకాళహస్తి సబ్‌ జైలు నుంచి కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. మరో ప్రధాన నిందితుడు గోగుల శ్రీకాంత్‌ (25) పరారీలో ఉండగా, అతడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. కుటుంబ పెద్ద గోగుల నాగేష్‌ (44)తో కలిసి వీరు కొంతకాలంగా తిరుమలలో వివిధ నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement