రుయాలో అరుదైన చికిత్స | - | Sakshi
Sakshi News home page

రుయాలో అరుదైన చికిత్స

Jul 7 2026 2:01 AM | Updated on Jul 7 2026 2:01 AM

తిరుపతి తుడా: రుయా ఆస్పత్రి వైద్యులు సమయస్ఫూర్తితో వ్యవహరించి, అధునాతన వైద్య సాంకేతికత సహాయంతో 15 నెలల చిన్నారికి శస్త్రచికిత్స లేకుండా అత్యాధునిక వైద్యం అందించారు. గంగాధరనెల్లూరుకు చెందిన 15 నెలల తాబిష్‌అలీ తీవ్రమైన కడుపునొప్పి, కడుపు వాపు, విరోచనాలలో రక్తం పడడంతో అత్యవసర విభాగాన్ని సంప్రదించారు. పీడియాట్రిక్‌ సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ ఏబీ జగదీష్‌ బాలుడి పరిస్థితిని పరిశీలించారు. ‘ఇంటసస్సెప్షన్‌’ (ఒక పేగు మరొక పేగులోకి దూరిపోయే ప్రమాదకరమైన సమస్య) అని గుర్తించారు. సాధారణంగా దీనికి కోతతో కూడిన ఓపెన్‌ సర్జరీ అవసరమైనప్పటికీ డాక్టర్‌ జగదీష్‌ సీఆర్మ్‌ ఇమేజింగ్‌ సాంకేతికత సహాయంతో కోత లేకుండా, ఆపరేషన్‌ అవసరం లేకుండా ఆ చిన్నారి పేగు సమస్యను వైద్య బృందం విజయవంతంగా పూర్తిచేసింది. ఈ ప్రక్రియలో అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్‌ పద్మజ, డాక్టర్‌ మైథిలి, డాక్టర్‌ మధుసూదన్‌, పిడియాట్రిక్స్‌ విభాగాధిపతి డాక్టర్‌ కిరీటి సహకారాన్ని అందించారు.

ఎర్రచందనం నిందితుడిపై పీడీ యాక్ట్‌

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌: ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో నిందితుడిగా ఉన్న కేరళకు చెందిన నాసర్‌ కెఎన్‌ ఎలియాస్‌ నాసర్‌ భాయ్‌ (53)పై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. టాస్క్‌ ఫోర్స్‌ హెడ్‌ సుబ్బరాయుడు ప్రత్యేక కార్యాచరణ అమలులో భాగంగా టాస్క్‌ ఫోర్స్‌ ఎస్పీ శ్రీనివాస్‌, ఏఎస్పీ జె.కులశేఖర్‌ మార్గ నిర్దేశకత్వంలో ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే నాసర్‌ కెఎన్‌ ఎలియాస్‌ నాసర్‌ భాయ్‌ తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా మెట్టుపాళయంలో ఉంటూ ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అతనిపై పీడీ యాక్ట్‌ అమలుకు టాస్క్‌ఫోర్స్‌ సిఫారసు చేసింది. ఈ మేరకు తిరుపతి జిల్లా కలెక్టరు, జిల్లా మెజిస్ట్రేట్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ పీడీ యాక్ట్‌ అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు నిందితుడిని కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు.

చాఫ్‌ కట్టర్ల కొనుగోలుకు ఈ–టెండర్లు

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: ఎస్వీ గోసంరక్షణశాల డెయిరీ ఫామ్‌ అవసరాల కోసం రెండు చాఫ్‌ కట్టర్ల కొనుగోలుకు ఈ–టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. ఆసక్తి కలిగిన సంస్థలు, సరఫరాదారులు హెచ్‌టీపీపీఎస్‌://టెండర్‌.ఏపీఎంపొక్క్యూర్‌మెంట్‌.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యి కరెంట్‌ టెండర్స్‌ విభాగంలో ఎస్వీ గోసంరక్షణశాల డెయిరీ ఫామ్‌ను సర్కిల్‌/డివిజన్‌గా ఎంపిక చేసి టెండర్‌ పత్రాలను డౌన్‌్‌ లోడ్‌ చేసుకోవచ్చు. టెండర్‌ పత్రాలను ఈ నెల 21 సాయంత్రం 5.05 గంటల లోపు సమర్పించాలని పేర్కొంది. వివరాల కోసం 9281413626లో సంప్రదించాలని సూచించింది.

శ్రీవారి దర్శనానికి 6 గంటలు

తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 8 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 88,412 మంది స్వామిని దర్శించుకున్నారు. 31,273 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.5.05 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 6 గంటల సమయం పడుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement