జిల్లాలో వంట గ్యాస్‌పై వస్తున్న వదంతులతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇరాన్, ఇజ్రాయేల్ యుద్ధ పరిస్థితుల కారణంగా వంట గ్యాస్ సరఫరా దెబ్బతినిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. త్వరలో గ్యాస్ సిలిండర్లు దొరకవని, సరఫరా నిలిచిపోతుందనే వార్తలు వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా వేదికల ద్వారా వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ ప్రచారం ప్రజల్లో భయాందోళనలను పెంచుతోంది.
కాణిపాకం: చిత్తూరు జిల్లాలో 42 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. 6 లక్షల వరకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయేల్ యుద్ధ ప్రభావంతో గ్యాస్‌కు కొరత ఏర్పడుతోందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అనేక మంది వినియోగదారులు ముందస్తుగా సిలిండర్లను బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ఒకటి కాకుండా రెండు సిలిండర్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో గ్యాస్ బుకింగ్ వ్యవస్థపై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది.
బిజీబిజీగా టోల్ ఫ్రీ నంబర్లు
వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఒకేసారి గ్యాస్ బుకింగ్ కోసం కాల్స్ చేయడంతో టోల్ ఫ్రీ నంబర్లు బిజీగా మారుతున్నాయి. చాలా మంది పలుమార్లు కాల్ చేసినా కనెక్ట్ కాకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు నేరుగా గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుంటున్నారు. ముందస్తు బుకింగులతోనే సమస్య ఎదురవుతోందని ఏజెన్సీలు వివరిస్తున్నాయి. జిల్లాలో గ్యాస్ కొరత ఉందన్న వార్తలను నమ్మొద్దని చెబుతున్నాయి. ప్రస్తుతం సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, సరఫరా కూడా యధావిధిగా కొనసాగుతోందని స్పష్టం చేస్తున్నాయి.
సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తే
చిత్తూరు అర్బన్: వంట గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరించారు. యుద్ధం కారణంగా గ్యాస్ సిలెండర్ల కొరత ఉందని, ధరలు పెరిగిపోయాయంటూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వారిపైనా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎక్కడైనా సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తే డయల్–112కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రజలు ఆందోళన చెందొద్దని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్–ఇజ్రాయేల్ యుద్ధం నేపథ్యంలో జిల్లాలో గ్యాస్ సరఫరాలో కొరత ఏర్పడలేదని తెలిపారు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజులు, డబుల్ సిలిండర్ ఉన్నవారు 30 రోజుల వ్యవధిలోనే బుక్ చేసుకోవాలని, వెంటవెంటనే బుకింగ్ చేస్తే వెబ్ పోర్టల్ అనుమతించదన్నారు. సిలిండర్ డెలివరీ సమయంలో వినియోగదారులు తప్పనిసరిగా ఓటీపీతో ధ్రువీకరించుకోవాలని వెల్లడించారు. అవసరానికి మించి సిలిండర్లను నిల్వ చేయడం, కొనుగోలు చేయరాదని జేసీ హెచ్చరించారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, ప్రభుత్వ సంస్థల్లో అత్యవసర విభాగాలకు యధావిధిగా గ్యాస్ సరఫరా అందుతుందని స్పష్టం చేశారు. గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్లను నిబంధనల ప్రకారం సరఫరా చేయాలన్నారు. నిరంతరం పర్యవేక్షించాలని తహసీల్దార్లు, సివిల్ సప్లయీస్ డీటీలను ఆదేశించారు.


