‘హెచ్‌పీవీ’తో సర్వేకల్ క్యాన్సర్‌కు చెక్ తొలివిడతగా జిల్లాకు వచ్చిన 6,045 డోసులు ఆడపిల్లలకు ఉచితంగా వ్యాక్సినేషన్
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలోని ప్రభుత్వాస్పత్రులన్నింటిలో హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఎంపిక చేసిన ఆడపిల్లలకు మంగళవారం నుంచి ఈ వ్యాక్సినేషన్ చేపట్టినట్లు వెల్లడించారు. అధికారిక గణాంకాల ప్రకారం 14 ఏళ్ల నుంచి 15 ఏళ్లలోపు ఆడపిల్లలు 10,900 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ విడతల వారీగా ఈ వ్యాక్సిన్ వేయించనున్నారు. ఈ క్రమంలో ఒక్కో ఆడపిల్లకు 0.5 ఎంఎల్ డోసు వేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏఎన్‌ఎంలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. మూడు నెలలపాటు ఈ వ్యాక్సినేషన్ చేపట్టనున్నారు. ఇప్పటి వరకు రెండు రోజుల్లో 300 మందికి టీకా వేసినట్లు అధికారులు వివరిస్తున్నారు.
సర్వైకల్ క్యాన్సర్ నివారణకు కీలకం
సర్వైకల్ క్యాన్సర్ బారిన మహిళలు అధిక సంఖ్యలో పడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి హెచ్‌పీవీ వైరస్ కారణంగా వస్తుందని, చిన్న వయసులోనే వ్యాక్సిన్ వేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చని వెల్లడిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం హెచ్‌పీవీ వ్యాక్సిన్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో పాటు కొన్ని రకాల గొంతు క్యాన్సర్లు, జననేంద్రియ వ్యాధులను కూడా నివారించడంలో ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు.
దుష్ప్రభావాలు స్వల్పం
వ్యాక్సిన్ వేసిన చోట కొద్దిగా నొప్పి, వాపు, తల తిరగడం, స్వల్ప జ్వరం, కండరాల నొప్పులు వంటి సమస్యలు కొంతమందిలో కనిపించే అవకాశముందని వైద్యులు తెలియజేస్తున్నారు. తీవ్రమైన అనారోగ్యం ఉన్న వారు కోలుకునే వరకు వ్యాక్సిన్ వేయించుకోవద్దని సూచించారు. అలాగే ఎలర్జీ ఉన్న వారు ముందుగా వైద్యుల సలహా తీసుకోవాలని వెల్లడిస్తున్నారు.
ఆడబిడ్డల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధానంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా టీకాస్త్రం అందించింది. ఈ మేరకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ఉచితంగా వేయిస్తోంది. అందులో భాగంగా జిల్లాకు తొలివిడతగా 6,045 డోసులను సరఫరా చేసింది. ఈ క్రమంలోనే వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం ముమ్మరంగా వ్యాక్సినేషన్ చేపడుతోంది. సర్వేకల్ క్యాన్సర్ బారిన పడకుండా 14 ఏళ్ల నుంచి 15 ఏళ్లలోపు బాలికలు ముందస్తు జాగ్రత్తగా టీకా వేయించుకోవాలని సూచిస్తోంది.
ఉచితంగానే..
సాధారణంగా మార్కెట్లో ఒక్కో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ధర సుమారు రూ.4 వేల వరకు ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ప్రాధాన్యం ఇచ్చి ఈ ఖరీదైన వ్యాక్సిన్‌ను ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆడపిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తోంది.


