శాంతిపురం: తరతరాలుగా తమకు అన్నం పెడుతున్న భూములను విమానాశ్రయానికి ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భూసేకరణపై రైతులతో చర్చించేందుకు తహసీల్దార్ ప్రకాష్‌బాబు బుధవారం మండలంలోని దండికుప్పం గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, పదేపదే భూముల కోసం వేధిస్తే ప్రాణాలు తీసుకోవడం మినహా గత్యంతరం లేదని తేల్చిచెప్పారు. ఉన్న భూములు లాక్కుని భిక్షగాళ్లుగా మార్చవద్దని వేడుకున్నారు. సిద్ధారెడ్లపల్లెకు చెందిన మహిళా రైతులు సులోచనమ్మ, పద్మమ్మ మాట్లాడుతూ భూములు పోతాయనే బాధ కంటే తమ ప్రాణాలు తీసుకోవడమే మేలని వాపోయారు. దీనిపై ఒత్తిడి చేయడం కంటే ప్రభుత్వమే విషమిచ్చి తమ కుటుంబాలను చంపేస్తే అరకొర పరిహారం కూడా ఇవ్వాల్సిన అవసరముండదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరు మారకపోతే తమ బలవన్మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఇప్పటికే తమ గ్రామానికి చెందిన వెంకటప్ప ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చావుబతుకులతో పోరాడుతున్నాడని వెల్లడించారు. తమ గ్రామానికి తాగునీరు, వ్యవసాయ భూములకు సాగునీరు ఇస్తున్న బోర్లు అన్నీ కురబవానికుంట ప్రాంతంలోనే ఉన్నాయన్నారు. ఇప్పుడు అధికారులు ఆయా భూములను, కుంటను లాగేసుకుంటే గ్రామంలో ఎవరూ బతకాల్సినపని లేదని తెలిపారు.దండికుప్పానికి చెందిన రైతులు చక్రపాణిరెడ్డి, లక్ష్మి మాట్లాడుతూ అభ్యంతరం లేని రైతులు ఇచ్చిన దాదాపు 2 వేల ఎకరాల్లోనే విమానాశ్రయం కట్టుకోవాలని చెప్పారు. వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్నామని, భూములను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోలేమని స్పష్టం చేశారు. అభివృద్ధి, విమానాశ్రయం పేరుతో తమ గ్రామాలకు ఉనికి లేకుండా చేయవద్దని విన్నవించారు. ఈ మేరకు రైతుల అభ్యంతరాలను రెవెన్యూ అధికారుల నమోదు చేసుకున్నారు. మొత్తం విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించి వెనుదిరిగారు. బాధిత రైతుల విజ్ఞప్తితో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, నేతలు మురళీరెడ్డి, మంజునాథరెడ్డి, శ్రీరాములుగౌడు గ్రామానికి చేరుకున్నారు. వారు మాట్లాడుతూ రైతులను ఒప్పించి భూములు తీసుకోవాలే కానీ, బలప్రయోగం చేయవద్దని అధికారులను కోరారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.


