సాక్షి టాస్క్‌ఫోర్స్: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కనిపించడం లేదంటూ తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం (ఏడీ బిల్డింగ్) వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే.అజయ్‌కుమార్ మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలల వీడియోలు బయటకు రావడంతో భక్తులు నిలదీస్తారనే భయంతో బయటకు కనిపించకుండా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ నాయుడు బయటకు వచ్చి హిందువులకు క్షమాపన చెప్పడంతో పాటు టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ ఎస్సీసెల్ జనరల్ సెక్రటరీ నల్లాని బాబు, ఉమ్మడి చిత్తూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్ వంశీ, రాష్ట్ర మీడియా ప్యానెలిస్ట్ పసుపులేటి సురేష్, పార్టీ బీసీ విభాగం జోనల్ అధ్యక్షుడు వాసుయాదవ్, నాయకులు అరుణ్‌యాదవ్, అనిల్‌రెడ్డి, మోహనరాజ్, రమణరెడ్డి, అమర్నాథ్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ నేతపై టీడీపీ గూండాల దాడి
నగరి: తన భూమి సర్వే చేయించుకునేందుకు యత్నించిన వైఎస్సార్‌సీపీ మండల యూత్ కన్వీనర్‌పై టీడీపీ గూండాలు దాడి చేశారు. ఈ ఘటన బుధవారం నగరి మండలం టీవీ కండ్రిగలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలు.. వైఎస్సార్‌సీపీ మండల యూత్ కన్వీనర్ గురుమూర్తికి టీవీ కండ్రిగలో కొంత భూమి ఉంది. ఆ అందులో సర్వే చేసి.. హద్దులు చూపించాలని సర్వేయర్‌కు ఆయన అర్జీ పెట్టుకున్నారు. సర్వేయర్ బుధవారం వస్తానంటూ సమాచారమిచ్చారు. సర్వేయర్ వచ్చేలోపు.. వ్యక్తిగత పనులు పూర్తి చేసుకుందామని గురుమూర్తి బైక్‌పై తన సోదరుడు ఎ.శివకుమార్‌రెడ్డితో కలిసి నగరికి బయలుదేరాడు. మార్గంమధ్యలో టీడీపీ నేత ఎం.స్వామినాథన్‌్ వారిని అడ్డుకున్నాడు. ‘ఎందుకు సర్వే చేయిస్తున్నావ్?’ అంటూ గురుమూర్తిని ప్రశ్నించాడు. ‘నా భూమిలో సర్వే చేయించుంటున్నాను. అది రైతుగా నా హక్కు. అందులో సమస్య ఏంటి?’ అని గురుమూర్తి స్పందించగా.. నాకే ఎదురు సమాధానమిస్తామా? అంటూ గురుమూర్తి, శివకుమార్‌రెడ్డిపై మండిపడ్డాడు. టీడీపీ స్థానిక నేతలు శ్రీధర్, శ్రీనివాసులు, భూపాల్, షణ్ముగరెడ్డితో కలిసి దాడి చేశారు. గ్రామస్తులు వారిని అడ్డుకుని.. బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గురుమూర్తి తెలిపారు.
డైయింగ్ యూనిట్ తనిఖీ
పుత్తూరు : గేట్ పుత్తూరులో నిర్వహిస్తున్న డైయింగ్ యూనిట్‌ను బుధవారం మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు తనిఖీ చేశారు. సమాచార హక్కుల వేదిక కార్యదర్శి కె.మురగారెడ్డి ఫిర్యాదు మేరకు స్పందించిన మున్సిపల్ అధికారులు డైయింగ్ యూనిట్‌ను పరిశీలించారు. వ్యర్థాలతో కూడిన రంగునీళ్లను పబ్లిక్ ప్రదేశంలో యథేచ్ఛగా వదలి పెడుతుండడం గమనించారు. దీంతో భూగర్భ జలాలు కలుషితమై, ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదముందని గుర్తించారు. అలాగే డైయింగ్ యూనిట్‌కు ట్రేడ్ లైసెన్స్ సైతం లేకనే ఏళ్ల తరబడి నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. తక్షణం యూనిట్‌ను స్వచ్ఛందంగా మూసివేయాలని నిర్వాహుకులను కమిషనర్ ఆదేశించారు. లేకుంటే యూనిట్‌ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ మోహనకృష్ణ పాల్గొన్నారు.


