చిత్తూరు రూరల్(కాణిపాకం): బయో మెడికల్ వేస్ట్ నిర్వహణపై వైద్య సిబ్బందికి బుధవారం శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో చేపట్టిన తరగతుల్లో డీఎంహెచ్‌ఓ సుధారాణి మాట్లాడుతూ ఆస్పత్రులు, ల్యాబ్‌లు, క్లినిక్‌లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను సురక్షితంగా వేరు చేసి శాసీ్త్రయ పద్ధతుల్లో నిర్వీర్యం చేయాలని సూచించారు. సూదులు, రక్తం అంటిన బ్యాండేజీలు, ఇతర ప్రమాదకర వ్యర్థాలను రంగుల కోడ్ డబ్బాలలో వేయడం ద్వారా కాలుష్యం, అంటువ్యాధుల వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు. పసుపు, ఎరుపు, తెలుపు, నీలం రంగుల కంటైనర్ల ద్వారా వ్యర్థాలను వర్గీకరించి నిర్వీర్యం చేయాలని స్పష్టం చేశారు. బయో మెడికల్ వ్యర్థాలను 48 గంటలకు మించి నిల్వ ఉంచకూడదని, ప్రత్యేక వాహనాల ద్వారా సురక్షితంగా తరలించాలని ఆదేశించారు. బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణలో అలసత్వం వహిస్తే హెచ్‌ఐవీ, హెపటైటిస్–బి వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశముందని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం ఆస్పత్రుల నిర్వాహకులు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ విభాగం సిబ్బంది గణేష్ కుమార్, రేఖ ఆధ్వర్యంలో శిక్షణ అందించారు. డీపీఎంఓ డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ నిరంజన్ రెడ్డి, డాక్టర్ దివ్య దీప్తి, జార్జి పాల్గొన్నారు.


