దైవదర్శనానికి వెళ్లి వస్తూ..
ఆటోను ఢీకొన్న కారు ఇద్దరి మృతి 10 మందికి గాయాలు
పుంగనూరు : అతి వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఆటో బోల్తా పడి ఇద్దరు మృతి చెందగా, 10 మంది గాయపడిన సంఘటన శుక్రవారం రాత్రి పట్టణ సమీపంలోని కొత్తపల్లె మలుపు వద్ద చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. రామసముద్రం మండలం, చెంబకూరు పంచాయతీ దిన్నిమీద హరిజనవాడకు చెందిన రా జమ్మ, కదిరప్ప , లక్ష్మీపతి, నారాయణమ్మ , గాయత్రి, రూపశ్రీ, లావణ్య, శరణ్య, రెడ్డెమ్మ , మనోజ్, ఆటో డ్రైవర్ రెడ్డెప్ప (38), నారాయణప్ప(52) కలసి ఆటోలో స్వగ్రామం నుంచి బయలుదేరి పెద్ద పంజాణి మండలం , వీరప్పల్లెలోని నల్లవీరగంగమ్మ గుడికి వెళ్లారు. అక్కడ అమ్మవారికి పూజలు చేసుకుని కుటుంబ సభ్యులతో కలసి సాయంత్రం స్వగ్రామానికి ఆటోలో తిరిగి బయలుదేరారు. మా ర్గ మధ్యలో కొత్తపల్లె వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారు డ్రైవర్ ఇమ్రాన్ అతి వేగంగా వచ్చి ఆటోను ఢీకొన్నాడు. ఈ సంఘటనలో కారు ఆటో ను ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్ రెడ్డెప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. నారాయణప్ప కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మిగిలిన 10 మంది గాయాలుపాలయ్యారు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించి, బాధితులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నారాయణమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి తరలించారు. ఈ మేరకు సీఐ సుబ్బరాయుడు కేసు నమోదు చేశారు.
బిక్కుబిక్కుమంటున్న చిన్నారులతో అవ్వ...
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఒకే కుటుంబానికి చెందిన లక్ష్మీపతి, గాయత్రి, లక్ష్మీపతి తల్లి రెడ్డెమ్మ, వారి చిన్నారులు లావణ్య, శరణ్య కలసి గుడికి వెళ్లి ప్రమాదంలో గాయపడ్డారు. చిన్నారుల తల్లిదండ్రులు ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. కానీ అదృష్టవశాత్తు అవ్వ రెడ్డెమ్మ కు , చిన్నారులు ఇద్దరికి స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటనతో నిశ్చేష్టులైన చిన్నారులను అవ్వ రెడ్డెమ్మ ఒడిలో పెట్టుకుని భయకంపితురాలైంది. ఇద్దరు చిన్నారులకు తల్లిదండ్రులు ప్రమాదంలో గాయపడిన సంఘటన తెలియకపోయినా ఏం జరిగిందోనన్న భయంతో చిన్నారులు బిక్కుబిక్కుమంటూ ఉండడం కనిపించింది.
దైవదర్శనానికి వెళ్లి వస్తూ..
దైవదర్శనానికి వెళ్లి వస్తూ..


