అందని రేషన్
పాలసముద్రం : మండలంలోని 10వ రేషన్ షాపు వద్ద రేషన్ బియ్యం సక్రమంగా వేయడం లేదని రేషన్ కార్డు లబ్ధిదారులు శుక్రవారం ధర్నా చేపట్టారు. రేషన్ కార్డుదారులు మాట్లాడుతూ.. శ్రీబొమ్మరాజుపురం ఆదిఆంధ్రవాడ, రాచపాల్యం, సన్నగుంట ఎస్టీ కాలనీ, గుండుబావి సన్నగుంట బీసీ కాలనీ గ్రామాలకు చెందిన 320 రేషన్ కార్డులు ఉన్నాయి. వీరందరికీ 10వ నంబర్ రేషన్ షాపును కేటాయించి ప్రభుత్వం నిత్యావసర సరుకులు సరఫరా చేస్తోంది. 320 రేషన్ కార్డులకు 5.500 టన్నులు రేషన్ బియ్యం పంపిణీ చేయాలి. ప్రస్తుతం ఆరు నెలలుగా 2.500 టన్నుల బియ్యం మాత్రమే షాపునకు పంపిణీ చేస్తున్నారు. మొదటి రెండు రోజులు వస్తున్న సుమారు 100 రేషన్ కార్డులకు 2.500 టన్నుల బియ్యం సరిపోతోంది. మిగిలిన 220 రేషన్ కార్డులకు బియ్యం లేవంటున్నారు. ప్రతి రోజు కూలీ పనులకు వెళ్లగా చాలీచాలని సంపాదనలో కుటుంబాలను పోషించుకుంటున్నామని, రేషన్ బియ్యం ఇవ్వకపోవడంతో మార్కెట్‌లో వేలకు వేలు పెట్టి బియ్యం కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలలుగా మా రేషన్ కార్డుల సరుకులు అందడం లేదని వాపోయారు.


