ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
పుంగనూరు: అతివేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనదారున్ని ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి పట్టణ సమీపంలోని అరబ్బీ కాలేజీ వద్ద చోటుచేసుకుంది. మండలంలోని గుడిసె బండకు చెందిన వెంకటరమణ కుమారుడు సోమశేఖర్(26) పట్టణంలోని ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పనులు ముగించుకుని రాత్రి ఇంటికి వెళుతుండగా అరబ్బీ కాలేజీ వద్దకు రాగానే ఎదురుగా పుంగనూరుకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సోమశేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.


