పంట భూములపై పగ!
కుప్పం : గుడుపల్లె మండలం పోగూరుపల్లె పంచాయతీ పరిధిలో పరిశ్రమల స్థాపనకు 400 ఎకరాల వరకు భూములు తీసుకున్నారు. అభివృద్ధిలో భాగమై యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని భూములు ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు మిగిలి ఉన్న ఎకరా, రెండెకరాలు వ్యవసాయ భూములు లాక్కోనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ భూములు పరిశ్రమలకు వెళ్తే రైతుల బతుకు తెరువు ఆగమ్యగోచరంగా మారుతుంది.
పరిశ్రమల కోసం భూముల సర్వే
గుడుపల్లె మండలం పోగూరుపల్లె పంచాయతీ పరిధిలో ఇప్పటికే 400 ఎకరాల్లో రైతుల భూములు పరిశ్రమల కోసం తీసుకున్నారు. ప్రస్తుతం మళ్లీ 100 ఎకరాలు పరిశ్రమలకు కావాలని 100 మంది రైతులకు జీవనాధారంగా ఉన్న భూములు సర్వే జరుపుతున్నారు. దీంతో 60 ఎకరాలు సెటిల్ మెంట్ పట్టా భూములు . వ్యవసాయం కోసం రైతులు చదును చేసి ఏర్పాటు చేసుకున్న భూములుపై బడా పారిశ్రామిక వేతల కన్ను పడింది. పక్కనే ఉన్న డీకేటీ, ప్రభుత్వ భూములను వదిలేసి కనుచూపు మేర చదునుగా ఉన్న పట్టా భూములు పరిశ్రమలకు కావాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే 100 ఏళ్లుగా అనుభవంలో ఉన్న డీకేటీ , ప్రభుత్వ భూములకు పరిశ్రమలకు వదిలేశారు. ఇప్పడు జీవనాధారంగా ఉన్న ఎకరా, రెండెకరాల పట్టా భూములను సైతం ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకోని రైతుల గోడు
రైతులకు జీవనాధరంగా ఉన్న వ్యవసాయ భూములపై కుప్పం ఆర్డీఓ, కడా పీడీ, ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరినా ఫలితం లేదు. అభివృద్థికిఽ అడ్డుపడొదు.. ఇండస్ట్రీయల్ అధికారుల చెప్పినట్లు భూములు స్వచ్ఛందంగా ఇవ్వాలని ఓ అధికారి రైతులకు ఉచిత సలహా ఇచ్చినట్లు సమాచారం. ఎవరూ రైతుల సమస్య పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులపై ఒత్తిళ్లు
ప్రస్తుతం ఏపీఐఐసీ స్వాధీనం చేసుకున్న వ్యవసాయ భూములు పక్కనే 60 ఎకరాల పట్టా భూములు ఉన్నాయి. ఆ 60 ఎకరాలతో పాటు 40 ఎకరాలల్లో నాలుగు పరిశ్రములు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాగా ఆ పట్టా భూముల్లో పట్టు పరిశ్రమ సాగుకు అనుకూలమైన భూములు. పట్టు పరిశ్రమను సాగు చేసేందుకు భారీ షెడ్లు నిర్మించి రైతులు జీవనం సాగిస్తున్నారు. నిత్యం పట్టుగూళ్లు సాగు చేసి పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం కోలార్, శ్రీనివాసపురంలో పట్టుగూళ్లు మార్కెట్‌లో విక్రయించి పోగూరుపల్లె రైతులు జీవ నం సాగిస్తున్నారు. ఇలాంటి సారవంతమైన భూములను పరిశ్రమలకు ఇవ్వాలని ఒత్తిడి చేయడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోగూరుపల్లె లెక్క దాఖలోని సర్వే నం.2,3,4,5,9, 137,250లలో గల 60 ఎకరాల పట్టా భూములు పరిశ్రమ కోసం సర్వే చేస్తుండడంతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.


