కులాలు, మతాలను రెచ్చగొట్టొద్దు
కార్వేటినగరం : ప్రశాంతంగా ఉన్న పచ్చని పల్లెల్లో కులాలు, మతాలను రెచ్చగొట్టి కూటమి ప్రభుత్వం విధ్వంసాన్ని సృష్టించడం మంచి పద్ధతి కాదని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. గురువారం పుత్తూరులోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల వరకే రాజకీయం చేయాలని, ఎన్నికల అనంతరం అందరికీ సమ న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న గ్రామాల్లో రాజకీయాల పేరుతో కక్షలు, కార్పణ్యాలతో విధ్వంసం సృష్టించి ప్రజలను భయాందోళనకు గురి చేయడం మంచిది కాదన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పాలన కోసం విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టి ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించారని, నేడు సీఎం చంద్రబాబు అభివృద్ధిని అడ్డుకుని కక్ష సాఽధింపు రాజకీయాలకు నాంది పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో విద్య, వైద్య వ్యవస్థను నాశనం చేసి రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. సంపద సృష్టిస్తానని 2024లో అధికారం చేపట్టిన చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడానికి కంకణం కట్టుకున్నాడని ఆరోపించారు. సంపద సృష్టిస్తానని ప్రభుత్వ ఆస్తులను బాబుకు అనుకూలంగా ఉన్న వారికి ధారాదత్తం చేయడానికి సిద్ధపడుతున్నారని విమర్శించారు. కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజల్లో అనూహ్య స్పందన లభిస్తోందని, రానున్న ఎన్నికల్లో మెడికల్ విద్యార్థుల తల్లిదండ్రులే టీడీపీకి గట్టి గుణపాఠం నేర్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న జెండా ఎగుర వేస్తామని, కూటమికి ఓటమి తప్పదని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి జోస్యం చెప్పారు.


