గుప్త నిధుల కలకలం
కుప్పంరూరల్ : కుప్పం మండలం, గణేష్‌పురం అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలతో ఒక్కసారిగా కలకలం రేగింది. గణేష్‌పురం అటవీ ప్రాంతంలో నంజంపేటకు చెందిన ఓ వ్యక్తి తవ్వకాలు చేపడుతున్నట్లు బుధవారం అటవీ, పోలీసులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. రంగ ప్రవేశం చేసిన అధికారులు గణేష్‌పురం అటవీలో తిమ్మలమ్మ చెరువు వద్ద తవ్వకాలు చేపట్టిన ప్రాంతాన్ని పరిశీలించారు. సుమారు 40 అడుగుల లోతు తవ్వకాలు చేపట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఆ గోతిలో కిందికి మరీ లోతుగా తవ్వకాలు చేపట్టినట్లు గ్రామస్తులు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి కుప్పం పర్యటన అనంతరం తవ్వకాలు చేపట్టిన ప్రాంతాన్ని నిపుణులతో పరిశీలించి నిజానిజాలు వెలికి తీస్తామని గ్రామస్తులకు పోలీసులు సర్ది చెప్పారు.
వేలు పనేనా ?
గుప్తనిధుల తవ్వకాల పని నంజంపేట గ్రామానికి చెందిన వేలు పనే అని గణేష్‌పురం గ్రామస్తులు పోలీసులకు వివరించినట్లు తెలిసింది. వేలు తమిళనాడు, కేరళ ప్రాంతాల నుంచి మాంత్రికులను తెచ్చి రాత్రిపూట తవ్వకాలు చేపడుతున్నట్లు పోలీసుల దృష్టికి తెచ్చారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టేందుకు పోలీసులు హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు చెప్పారు.


