
గంజాయి విక్రయిస్తున్న ఆరుగురి అరెస్టు
చిత్తూరు అర్బన్/నగరి : చిత్తూరు జిల్లాలో సోమవారం గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు టూటౌన్ సీఐ నెట్టికంటయ్య కథనం.. చిత్తూరు–బెంగళూరు బైపాస్ రోడ్డులోని రోసీనగర్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న గణేష్, లోకేష్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి ఒకటిన్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరూ బంగారుపాళ్యంకు చెందిన వ్యక్తులని.. మరోవ్యక్తి పారిపోయాడని సీఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ రమేష్‌బాబు పాల్గొన్నారు.
నగరి మండలంలో..
నగరి మండలం, తడుకుపేట గ్రామం తిరుపతి–చైన్నె హైవేకి ఆనుకుని ఉన్న మిక్సింగ్ ప్లాంట్ వద్ద ఎస్‌ఐ విజయ్‌నాయక్, ట్రైనీ ఎస్‌ఐ తేజస్విని పోలీసులు, డిప్యూటీ తహసీల్దార్ మేఘవర్ణంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రం, చైన్నె ఆవడికి చెందిన వెంకటేష్ (23), డి.కమలేష్ (18) తమకు ముందస్తు పరిచయం ఉన్న నగరి తడుకుపేట ఎస్టీ కాలనీకి చెందిన ఉదయ్ కిరణ్ (23), దేవేంద్ర(24) వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేస్తుండగా వారిని అక్కడే అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా చేసేవారిని పట్టుకోవడంతో ప్రతిభ కనబరచిన సిబ్బంది సత్య, గజేంద్ర, కదిరివేలు, గోపి, లోకనాథం, రవి, సురేష్, రమేష్‌ను అభినందించారు.

గంజాయి విక్రయిస్తున్న ఆరుగురి అరెస్టు