చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో చేస్తున్న ప్రచార ఆర్భాటం అంతాఇంత కాదు. ఏడాది తర్వాత మెగా డీఎస్సీని నిర్వహించారు. తీరా పరీక్షలు పూర్తి అయ్యాక మెరిట్ జాబితా విడుదల చేశాక స్పష్టమైన ఎంపిక అభ్యర్థుల జాబితాలు ఇవ్వకుండా దోబూచులాడుతున్నారు. ఈనెల 25న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు. ఆపై ఏమైందో ఏమో వెంటనే 26వ తేదీ అంటూ మరో మారు ప్రకటించి గందరగోళం సృష్టించారు. సోమవారం సాయంత్రం జిల్లావిద్యాశాఖ అధికారులతో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో మళ్లీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈనెల 28వ తేదీన సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని ఆయన వెల్లడించారు.
ఆంతర్యమేమిటో
మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలను వాయిదా వేయడం పట్ల ఆంతర్యమేమిటో అర్థం కాలేదని పలువురు పెదవి విరుస్తున్నారు. రోజుకొక జాబితాను విడుదల చేస్తున్న విద్యాశాఖ అధికారుల తీరు పట్ల అభ్యర్థులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం తమకు అనుకూలమైన అభ్యర్థుల కోసం పాకులాడుతోందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.
రాత్రుల్లో సందేశం..ఉదయాన్నే పరిశీలన
కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రక్రియలో రాత్రుల్లో సందేశం పంపి హడావుడి చేసి ఉదయాన్నే పరిశీలనకు హాజరుకావాలనే విధంగా ప్రవర్తిస్తోంది. ఆకస్మిక నిర్ణయాలతో అభ్యర్థుల్లో వివిధ ప్రాంతాల్లో, వివిధ సమస్యలతో ఉంటే ఎలా పరిశీలనకు విచ్చేస్తారని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.