‘సిద్ధి’ వినాయకా..‘బుద్ధి’ ప్రదాయకా | - | Sakshi
Sakshi News home page

‘సిద్ధి’ వినాయకా..‘బుద్ధి’ ప్రదాయకా

Aug 25 2025 8:40 AM | Updated on Aug 25 2025 9:20 AM

‘సిద్ధి’ వినాయకా..‘బుద్ధి’ ప్రదాయకా

‘సిద్ధి’ వినాయకా..‘బుద్ధి’ ప్రదాయకా

● వరసిద్ధుడికి వెయ్యేళ్ల చరిత్ర ● సత్య ప్రమాణాలకు ప్రసిద్ధి ● 27 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ● పూర్తవుతున్న ఏర్పాట్లు

కాణిపాకం : సత్య ప్రమాణాలకు నెలవుగా.. అసత్యాలు చెబితే సింహ స్వప్నంగా కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి క్షేత్రం బాసిల్లుతోంది. కోరిన కోర్కెలు తీర్చే ఆరాధ్యుడిగా పూజలందుకుంటున్నాడు. ఈ సిద్ధి, బుద్ధిని దర్శిస్తే.. విఘ్నాలు హరించి..సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇంతటి మహత్యం కలిగిన వరసిద్ధి వినాయక దేవస్థానం 1000 ఏళ్ల చర్రిత ఉంది. ఏటా ఈ క్షేత్రంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈనెల 27వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కాణిపాక ఆలయంపై ప్రత్యేక కథనం.

ఆలయ ప్రాశస్త్యం ఇదీ..
పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్లుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ..వ్యవసాయే జీవనాధారంగా బతికేవారు. ఇక ఆ గ్రామాన్ని కరువు కాటకాలు చుట్టుముట్టాయి. గ్రామ జనానికి గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రయత్నంలో ఆ ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతుగా తవ్వాలనుకున్నారు. బావిని తవ్వే క్రమంలో ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది. ఆ రక్తంతో తడిసిన ఆ ముగ్గురు సోదరులకు అంగ వైకల్యం మటు మాయమైంది. ఈ విషయం ఆ నోట..ఈనోట పడి..ఊరంతా తెలిసింది. ఈ విచిత్రం తెలుసుకున్న జనం ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించింది. బావిలోని గణనాథుని రూపం చూసి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ.. కొబ్బరికాయలు కొట్టారు. అలా స్వామివారి విగ్రహం వద్ద కొట్టిన కొబ్బరికాయల నుంచి వచ్చిన తీర్థం కాణి భూమి (కాణి అంటే ఎకరం పొలం అని అర్థం)లోకి పారింది. అప్పటి నుంచి విహారపురి గ్రామం కాణిపారకమ్‌ కాలక్రమేణా కాణిపాకంగా మారింది. ఇలా స్వామి వారు స్వయంభుగా వెలసి.. కోరిన కోర్కెలు తీర్చే గణనాథుడిగా భక్తుల చేత పూజలందుకుంటున్నాడు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జీర్ణోద్ధరణ పనులు
కాణిపాకం ఆలయం సుమారు 1000 ఏళ్ల క్రితం నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.. చోళుల కాలంలో ఆలయం నిర్మితమైనట్లు పూర్వీకు లు చెబుతున్నారు. 11వ శతాబ్ధం..కుళతుంగ చోళ రాజు పరిపాలనలో ఆలయ నిర్మాణం జరిగినట్లు ఆధారాలున్నాయి. ఇక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో (2011) ఆలయ జీర్ణోధరణకు నోచుకుంది.

తప్పుడు ప్రమాణాలు చేస్తే.. శిక్ష ఖాయం

సత్య ప్రమాణాలకు ఆరాధ్యుడిగా కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి వెలుగొందుతోంది. తప్పు చేసే వ్యక్తులను స్వామి సన్నిధిలో ప్రమాణం చేయిస్తే..ఆదిదేవుడే శిక్షిస్తాడని భక్తుల విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రమాణం చేయిస్తే..వాటికి దూరంగా ఉంటారని భక్తుల నమ్మకం. సవాల్‌..ప్రతి సవాల్‌ల్లో కూడా సత్య ప్రమాణాలకు కాణిపాక వరసిద్ధి వినాయకస్వామిని ప్రతి ఒక్కరూ తలచుకుంటారు. దీంతో పాటు గణపతి హోమం, సంకటహర గణపతి వ్రతాలకు భక్తుల విశేషంగా కొలుస్తారు.

27 నుంచి బ్రహ్మోత్సవాలు
కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27 నుంచి సెప్టెంబర్‌ 16వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ప్రతి రోజు స్వామి వారు వివిధ వాహన సేవల్లో దర్శనమివ్వనున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్‌ దీపాలంకరణతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పెయింటింగ్‌ పనులను పూర్తి చేశారు. పుష్పాలంకరణ, అన్నదానం, ప్రసాదం, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తుల వసతులు తదితర అంశాలపై ముందస్తు చర్యలు తీసుకున్నారు. ప్రతి రోజు అభిషేకం, స్వామి దర్శనం, ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరగనుంది.

సేవలు ఇలా..

తేదీ పగలు సేవలు రాత్రి సేవలు

27 వినాయకచవితి గ్రామోత్సవం

28 ధ్వజారోహణం హంసవాహనం

29 నెమలివాహనం బంగారు నెమలివాహనం

30 – మూషిక వాహనం

31 బంగారు బంగారు

చిన్నశేషవాహనం పెద్దశేషవాహనం

1–09 చిలుక వాహనం వృషభవాహనం

02 – గజవాహనం

03 రథోత్సవం –

04 బిక్షాండి తిరుకల్యాణం,అశ్వవాహనం

05 ధ్వజారోహణం ఏకాంత సేవ,

వడాయత్తు ఉత్సవం

ప్రత్యేక ఉత్సవాలు

తేది వాహనసేవ

06–09–2025 అధికార నంది వాహనం

07 రావణ బ్రహ్మవాహనం

08 యాళి వాహనం

09 సూర్యప్రభ వాహనం

10 చంద్రప్రభ వాహనం

11 కల్పవృక్ష వాహనం

12 విమానోత్సవం

13 పుష్పపల్లకీ

14 కామధేను వాహనం

15 పూలంగిసేవ

16 తెప్పోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement