
ఆశచూపి దోచేశారు!
●
చౌడేపల్లె: కష్టపడి సంపాదించిన సొమ్ములో ఎంతో కొంత దాచుకోవాలని ఆశపడ్డారు. దాచుకొన్న డబ్బును వృద్ధాప్యంలో అవసరమైనప్పుడు ఉపయోగపడుతుందన్న ఆశతో అవని కోఆపరేటివ్ సొసైటీ సంస్థలో దాచుకున్నారు. అయితే ఆ సంస్థ వారి డబ్బును దోచేసింది. ఈ విషయం గుర్తించిన బాధితులు ఏళ్ల తరబడి న్యాయం కోసం అధికారులు, పోలీసులకు విన్నవించినా వారు కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పుంగనూరు, బి.కొత్తకోట, గుర్రం కొండ, పలమనేరు, బంగారుపాళెం, పాకాల, పీలేరు తదితర ప్రాంతాల్లో 2014లో ఏజీఎస్ పరివార్ మ్యాచువల్లి ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పేరుతో చిన్న ప్రైవేటు బ్యాంకును ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో భవనాలను అద్దెకు తీసుకుని బ్యాంకు శాఖల ఏర్పాటుతోపాటు సిబ్బందిని నియమించి గ్రామాల్లో పరిచయం ఉన్న వారితో ఖాతాలను తెరిపించారు. వారికి ఆశ చూపి తమ బ్రాంచిలో అనేక లబ్ధి పొందే పథకాలున్నాయని, చదువులేని, పేదలకు ఆశచూపారు. తమ వద్ద పెన్షన్ ప్లాన్, చిల్డ్రన్స్ ప్లాన్, రోజువారీ ఖాతా, నెలవారీ ఖాతా , సేవింగ్స్ ఖాతా, ఆర్డీ తదితర సేవలున్నాయని గ్రామీణ ప్రాంతాల్లో స్థానికులను పరిచయం చేసుకుని, ఏజెంట్ల ద్వారా భారీగా నగదు వసూలు చేశారు.
20 వేల మందికి పైగా ఖాతాదారులు
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ సంస్థలో సుమారు 20 వేల మందికి పైగా ప్రజలు ఖాతాలు ప్రారంభించారు. వారి నుంచి డిపాజిట్‌లను సేకరించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు, చిన్నపాటి వ్యాపారుల నుంచి వారి ఆర్థిక పరిస్థితి ఆధారంగా రోజుకు రూ.100 నుంచి రూ.1500 వరకు ఏజెంట్లతో నగదు వసూలు చేయించారు. రెండేళ్ల నుంచి ఐదేళ్ల వరకు గడువు విధించారు. గడువు తీరిన ఖాతాదారులకు అదనంగా 12 శాతం వడ్డీతో కలిపి తిరిగి సొమ్ము చెల్లించేలా నింబంధనలు పెట్టి టోకరా వేశారు.
రూ.50 కోట్లకు పైగా దోచేశారు
ఖాతాదారుల నుంచి డిపాజిట్లు రూపంలో సుమారు రూ.50 కోట్లకు పైగా దోచేశారని బాధితులు తెలిపారు. కష్టపడి సంపాదించిన నగదు డిపాజిట్ల రూపంలో పరుల పాలైందని గుర్తించిన లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో లబోదిబో మంటూ బోరున విలపిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు చేపట్టాలి.
సంస్థకు నగదు చెల్లించిన పాసు పుస్తకాలు, ఖాతాదారులకు సంస్థ ఇచ్చిన బాండ్లు
చెక్ ఇచ్చారు..డబ్బులు ఎగ్గొట్టారు
రోజంతా కష్టపడితే రూ.200 కూలీ ఇస్తారు. నెలకు రూ.వెయ్యి చొప్పున సంస్థకు చెల్లించాను. వృద్ధాప్యంలో అవసరాలకు వాడుకోవచ్చని ఆశపడి కట్టారు. గడువు తీరిందని తెలిపితే నాకు ఒక చెక్కు ఇచ్చారు. బ్యాంకుకెళ్లితే డబ్బులు ఇవ్వలేదు. సంస్థ కార్యాలయం వద్దకు వెళ్లితే సమాధానం చెప్పేవారు కూడా లేరు. – సాకమ్మ, పెద్దకొండామర్రి
ఏమిచేయాలో దిక్కుతోచడంలేదు
వృద్ధాప్యంలో ప్రభుత్వం నాకు ఇచ్చే పింఛన్ డబ్బును అవని కోఆపరేటివ్ సొసైటీలో కట్టాను. నేను కట్టిన డబ్బును మోసం చేసి కాజేశారని తెలిసి కుమిలిపోతున్నాను. నా లాంటి పేదలను ఇలా మోసం చేయడం తగదు. ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. మీరైనా న్యాయం చేయండి. – లక్ష్మమ్మ, పెద్దకొండామర్రి

ఆశచూపి దోచేశారు!

ఆశచూపి దోచేశారు!

ఆశచూపి దోచేశారు!