
అర్చకుల పేరుతో ఘరానా మోసం
శాంతిపురం : కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయకస్వామి, తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆలయ పూజారుల పేరుతో వచ్చి ప్రజల భక్తిని సొమ్ము చేసుకునే ముఠా సులువుగా లక్షలు దోచుకుంటోంది. ఆలయాల పవిత్రత, భక్తుల నమ్మకాలను దెబ్బతీసేలా ఓ ముఠా దందా సాగిస్తోంది.
మీ ఇంట్లోకి రావచ్చా...
అకస్మాత్తుగా ఇంటి ముందుకు ఓ ఐదుగురు పురోహితులు వచ్చి ‘మీ ఇంట్లోకి రావచ్చా’ అని అడుగుతారు. స్వాములు వచ్చారని లోనికి రమ్మనగానే అందరూ ఒక్కసారిగా ఏవో మంత్రాలు చెబుతూ ఇంట్లోకి వస్తారు. మంత్రాలను కొనసాగిస్తూ పూజ తట్ట తీసుకురమ్మని అందులోకి విభూది, కుంకుమ, నాలుగు పూలు వేసి ఇంట్లో వాళ్ల చేతిలో పెడతారు. తమలో ముగ్గురు కాణిపాకం ఆలయ అర్చకులమని, మరో ఇద్దరు తిరుత్తణి ఆలయ అర్చకులమని పరిచయం చేసుకుంటారు. భగవంతుడి నిర్దేశం మేరకు ఆ ఇంటికి వచ్చామని, ఇకపై అన్నీ శుభాలే కలుగుతాయని చెబుతారు. వినాయకచవితి సందర్భంగా కాణిపాకంలో పెద్ద ఎత్తున అన్నదానం చేసేందుకు మీ కుటుంబం తరపున రూ 5,116కు తక్కువ కాకుండా నగదు రూపంలో విరాళం ఇవ్వాలని కోరతారు. తమకు సమయం లేదని వెంటనే నగదు ఇస్తే త్వరగా వెళ్లాలని హడావుడి చేస్తారు. ఆ ఇంట్లో వారు డబ్బు ఇవ్వగానే వీడ్కోలు పలికి క్షణాల్లో మరో ఇంటికి, మరో గ్రామానికి వెళ్లిపోతారు. పురోహితుల వేషధారణలోని వారు కారులో గ్రామంలోకి రాగానే అక్కడ స్థితిమంతులు, దైవ కార్యాలకు ఖర్చు చేసే పుణ్యాత్ములు ఎవరని స్థానికులను ఆరా తీసి ఆ ఇంటిని ఎంచుకొంటున్నారు.
రూ.లక్ష బురిడీ
నల్లరాళ్లపల్లి, చౌడంపల్లి, ఎం.శాంతంపల్లి, గంగతిమ్మనపల్లి, దండికుప్పం తదితర గ్రామాల్లో ఆదివారం ఉదయం వీరు జనాన్ని బురిడీ కొట్టించారు. ఉదయమే ఈ ప్రాంతంలో దాదాపుగా లక్ష రూపాయలకు పైగా వసూళ్లకు పాల్పడ్డారు. ఈ స్వాముల వ్యవహారాన్ని సందేహించిన ఓ బాధితుడు వీరిని ఫొటో తీసి కాణిపాకం , తిరుత్తణి మురుగన్ ఆలయ అధికారులను ఆరా తీయడంతో వారు నకిలీలుగా తేలింది. దీంతో దండికుప్పంలో ఉన్న వారిని గుర్తించి పోలీసులకు అప్పగించే ప్రయత్నం చేయడంతో కాళ్లావేళ్లా పడి సొమ్మును వెనక్కి ఇచ్చిన అక్కడి నుంచి బయటపడ్డారు. కాగా గత ఏడాది దసరా సమయంలో కూడా ఇదే ముఠా ఆలయ నిర్మాణం పేరుతో వచ్చి వసూళ్లు చేసిందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న రాళ్లబూదుగూరు ఎస్‌ఐ నరేష్ సిబ్బందితో పాటు రామకుప్పం పోలీసులను అప్రమత్తం చేసి గాలింపు చేపట్టారు. అయితే పురోహితుల పేరిట వచ్చిన వారు అప్పటికే ఉడాయించారు. ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆలస్యం చేయకుండా అనుమానితుల సమాచారం పోలీసులకు తెలపాలని ఎస్‌ఐ కోరారు.