
సర్టిఫికెట్ల పరిశీలనలో గందరగోళం
డీఎస్సీ అభ్యర్థులకు సమాచారం కరువు 25న పరిశీలన ఉందంటూ హంగామా సమయం ఇవ్వకుండా పరిశీలన అంటే ఎలా? రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ధోరణిపై మండిపాటు
చిత్తూరు కలెక్టరేట్ : డీఎస్సీ కసరత్తులో సరైన పారదర్శకత లేకపోవడంతో ఈ ప్రక్రియలో తప్పిదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పలుచోట్ల అభ్యర్థులు తమ కు అన్యాయం జరిగిందంటూ లబోదిబోమంటున్నా రు. కనీసం వారి సమస్యను విద్యాశాఖ అధికారులు ప ట్టించుకోని దుస్థితి ఏర్పడుతోంది. పగలంతా సమ యం లేనట్టు ఈనెల 22వ తేదీన అర్ధరాత్రి వెబ్‌సైట్‌లో మెగా డీఎస్సీ మెరిట్ జాబితాను అప్‌లోడ్ చేశారు. ఈ ప్రక్రియ అయిన తర్వాత పలువురు అభ్యర్థుల ఫలితాలు తారుమారు అయ్యాయి. మొదట్లో స్కోర్ బోర్డ్ ఫలితాలు ఇచ్చినప్పుడేమో అర్హత సాధించిన అభ్యర్థులు....మెరిట్ జాబితాలు ఇచ్చిన సమయంలో అనర్హులయ్యారు. ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో పలుచోట్ల జరిగాయి. మెరిట్ జాబితాలు ఇచ్చిన అధికారులు కట్ ఆఫ్ తెలియజేయకపోవడం ఎంపికై న అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. కూటమి ప్రభుత్వం డీఎస్సీని ప్రచార డీఎస్సీగా మార్చుకుంటోంది తప్ప నిరుద్యోగులకు న్యాయం చేసేలా లేదని విద్యావేత్తలు మండిపడుతున్నారు.
సమయం ఇవ్వకుండా పరిశీలన ఎలా..?
కూటమి ప్రభుత్వం డీఎస్సీ పరీక్షల సమయంలో దరఖాస్తులు స్వీకరించేటప్పుడు అనేక నిబంధనలు విధించి మోసం చేసింది. ఆ తర్వాత పరీక్షల సమయంలో అనేక లోటుపాట్లతో అభ్యర్థులకు ఇబ్బందులు సృష్టించారు. తీరా ఫలితాలు వచ్చాక సర్టిఫికెట్‌ల పరిశీలనప్పుడు మళ్లీ ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఈ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూటమి ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులతో ఆడుకుంటోంది. ఈ నెల 24వ తేదీ రాత్రి వరకు ఎలాంటి కాల్ లెటర్లు ఇవ్వకుండా 25 వ తేదీన సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని ఆకస్మికంగా వెల్లడిస్తే ఎలా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఒకరిద్దరు కాదు 1478 మంది అభ్యర్థుల సర్టిఫికెట్‌లను పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఈ పరిశీలన అనేది చాలా కీలక ఘట్టం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అనాలోచిత నిర్ణయాలపై ఆకస్మికంగా పరిశీలన ఉంటుందని తెలిపితే చాలా మంది అభ్యర్థులు సరైన సర్టిఫికెట్‌లు తెచ్చుకోలేని పరిస్థితి. దూరాభారం నుంచి చిత్తూరు జిల్లా కేంద్రానికి చేరుకోలేని పరిస్థితి. సమయం ఇవ్వకుండా...ఏ సర్టిఫికెట్‌లు తీసుకురావాలో చెప్పకుండా సర్టిఫికెట్‌ల పరిశీలన ఎలా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
రెండు కేంద్రాల్లో పరిశీలన
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో పరీక్షలు రాసి ఎంపికై న అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ మురకంబట్టు వద్ద ఉన్న అపోలో యూనివర్శిటీ, తిరుపతి రోడ్డులోని ఆర్‌వీఎస్ నగర్ వద్ద ఉన్న ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో సర్టిఫికెట్‌ల పరిశీలన నిర్వహించనున్నారు. ఈ కేంద్రాల్లో పరిశీలనకు అవసరమైన ఏర్పాట్లను విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా చేపడుతున్నారు. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సర్టిఫికెట్‌ల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు ఏ సర్టిఫికెట్‌లను పరిశీలనకు తీసుకురావాలి, ఎంత సమయానికి హాజరవ్వాలి అనే విషయం ఈనెల 24వ తేదీ రాత్రి వరకు వెల్లడించని దుస్థితి. దీంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారుల వింత ధోరణి పై డీఎస్సీ అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు.
అధికారులకు ఓరియెంటేషన్
సర్టిఫికెట్‌ల పరిశీలన విషయం పై విద్యాశాఖ ఏడీ వెంకటేశ్వరరావును వివరణ కోరగా డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్‌ల పరిశీలనకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. రెండు ఇంజినీరింగ్ కళాశాలల్లో మౌలిక వసతులు, పరిశీలన చేసే బృందాల్లోని అధికారులకు ముందస్తుగా ఓరియెంటేషన్ ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర అధికారుల నుంచి వచ్చే ఉత్తర్వుల మేరకు సర్టిఫికెట్‌ల పరిశీలన నిర్వహిస్తామని సమాధానమిచ్చారు.
ఎప్పుడు రావాలో తెలియని దుస్థితి
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 1478 పోస్టులను మెగా డీఎస్సీ ప్రక్రియలో భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపికై న విద్యార్థులకు సమాచారం అందజేయాల్సి ఉంటుంది. ఎంపికై న అభ్యర్థులకు కాల్ లెటర్స్ వ్యక్తిగత లాగిన్‌లకు పంపుతామని ప్రకటించారు. అయితే ఈనెల 24వ తేదీ రాత్రి వరకు కాల్‌లెటర్‌లు అభ్యర్థులకు దరిచేరని దుస్థితి. ఒక వైపేమో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఈనెల 25వ తేదీన డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్‌ల పరిశీలన ఉంటుందని, సిద్ధంగా ఉండాలని మౌఖికంగా వెల్లడిస్తున్నారు. కానీ అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఆదివారం రాత్రి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో డీఎస్సీ అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు సర్టిఫికెట్‌ల పరిశీలన ఎప్పుడుంటుందో తెలియని దుస్థితిలో అభ్యర్థులు అయోమయానికి లోనవుతున్నారు.