
వెదురుకుప్పం : ఆడపిల్లలపై సమాజంలో జరుగుతున్న వివక్షపై తిరుగుబాటు చేస్తూ ఓ యువ రచయిత రాసిన నవలను సీ్త్ర ప్రపంచానికి అంకితం చేశారు. జాను అనే నేను నా స్నేహితురాళ్లు అనే నవల ద్వారా ఆడపిల్లలపై తల్లిదండ్రులకు ఉన్న చిన్నచూపుపై తన కలం ద్వారా వెలుగెత్తి చాటాడు. వెదురుకుప్పం మండలానికి చెందిన పేట యుగంధర్ రెడ్డి సమాజంలో మగ పిల్లలపై ఉన్న ప్రేమ వాత్సల్యాన్ని ఆడపిల్లలపై చూపడం లేదనే అంశంపై జాను అనే నేను నా స్నేహితురాళ్లు అనే నవలను రాశారు. ఆదివారం సాయంత్రం తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఈ నవలను ఆవిష్కరించారు. ఎస్వీయూ వేద విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య సదాశివమూర్తి నవలను ఆవిష్కరించారు.
ఈ నవలతో పాటు తిరుపతికి చెందిన రచయిత కృష్ణస్వామి రాజు రాసిన మునికష్టడి మాణిక్యం అనే నవలను కూడా ఆవిష్కరించారు. అదే విధంగా ఓరియంటల్ రీసెర్చ్ ఇన్సిట్యూట్ డైరెక్టర్ ఆచార్య పీసీ వెంకటేశ్వర్లు పేట యుగంధర్ రాసిన జాను అనే నేను నా స్నేహితురాళ్లు పుస్తకానికి సమీక్ష చేశారు. మగ పిల్లలకు ఇచ్చినంత స్వేచ్ఛ ఆడపిల్లలకు ఇవ్వడం లేదని పల్లెల్లో మరింత ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. గంగిశెట్టి శివకుమార్ మాట్లాడుతూ.. నవలలో జాను చూపిన తెగువ ప్రతి ఆడపిల్లలో ఉండాలన్నారు. కార్యక్రమంలో రచయితలు జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి, ఆకుల మల్లేశ్వరరావు, మేఘనాఽథ్‌రెడ్డి, పల్లిపట్టునాగరాజు, డాక్టర్ లక్ష్మీప్రియ తదితరులు పాల్గొన్నారు.