
బాలల సంరక్షణ అందరి బాధ్యత
చిత్తూరు లీగల్ : బాలల సంరక్షణ అందరి బాధ్యత అని జిల్లా కోర్టు సెషన్స్ న్యాయమూర్తి రమేష్ అన్నారు. శనివారం జిల్లా కోర్టులో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో బాలల సంరక్షణ, రక్షణ (జువైనల్) చట్టంపై ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయమూర్తి రమేష్ మాట్లాడుతూ చిన్న పిల్లలు తెలిసో తెలియకో చేసిన నేరాలను క్షుణ్ణంగా పరిశీలించి, వారిలో మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత పోలీసు, చైల్డ్‌వెల్ఫేర్ అధికారులు, చైల్డ్‌వెల్ఫేర్ కమిటీ సభ్యులపై ఉంటుందన్నారు. బాలల న్యాయ సంరక్షణ, రక్షణ చట్టం 2015పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. తెలిసో తెలియకో చట్టానికి విరుద్ధంగా నేరాలు చేసిన పిల్లలను జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందుకు 24 గంటల్లోగా హాజరుపరచాలన్నారు. నేరాలు చేసిన పిల్లలను కొట్టడం, మీడియా ముందుకు తీసుకురావడం వంటి చేయకూడదన్నారు. పిల్లలు ఏ కారణం చేత నేరాలు చేశారనే వివరాలను స్నేహపూర్వకంగా సైకాలజిస్ట్‌తో తెలుసుకోవాలన్నారు. వారి వివరాలను తెలుసుకుని మార్పు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎనిమిది, తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తులు శ్రీదేవి, శ్రీనివాసరావు మాట్లాడుతూ పిల్లలు దేశ భవిష్యత్‌కు ముఖ్యమైన మూలధనం అన్నారు. వారి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. దివంగత ఏపీజే అబ్దుల్ కలామ్ సైతం అనాథ పిల్లల భవిష్యత్ గురించి మాట్లాడారని గుర్తుచేశారు. సమాజంలో ప్రతి ఒక్కరు అనాథ పిల్లల భవిష్యత్‌పై దృష్టి సారించాలన్నారు. మూడో అదనపు మేజిస్ట్రేట్, జువైనల్ జస్టిస్ బోర్డు న్యాయమూర్తి సంధ్యారాణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పిల్లల భవిష్యత్ విషయంలో బాధ్యత కలిగి ఉండాలన్నారు. నేరం ఆరోపించబడిన పిల్లలు నేరస్తులు కారన్నారు. పిల్లల మానసిక స్థితిగతులను అర్థం చేసుకుని మెలగాలని తెలిపారు. ఈ వర్క్‌షాప్‌లో తిరుపతి జిల్లా ప్రభుత్వ బాలుర అబ్జర్వేషన్ హోమ్ సూపరింటెండెంట్ శరత్‌బాబు, అపోలో మెడికల్ కాలేజ్ సైకియాట్రిస్ట్ డాక్టర్ దినేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.