
కడప విశ్రాంత తహసీల్దార్‌పై దాడి
పుంగనూరు: మదనపల్లె నుంచి పుంగనూరుకు బస్సులో ప్రయాణిస్తున్న కడప విశ్రాంత తహసీల్దార్ అంజాద్‌హుస్సేన్(70)పై పక్క సీట్లో కుర్చున్న వ్యక్తి ఘర్షణ పడి దాడి చేసిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. సీఐ సుబ్బరాయుడు కథనం మేరకు.. కడప విశ్రాంత తహసీల్దార్ అంజాద్‌హుస్సేన్ పుంగనూరు తహసీల్దార్ రామును కలిసేందుకు బస్సులో పుంగనూరుకు వస్తున్నాడు. ఈ క్రమంలో పక్క సీట్లో కుర్చున్న షేర్‌ఖాన్ సెల్‌ఫోన్‌లో ఇతరులను దుర్భాషలాడుతూ పెద్దశబ్దం చేస్తూ మాట్లాడుతుండడంతో అలా మాట్లాడకండి అని అంజాద్‌హుస్సేన్ చెప్పాడు. దీంతో మీరెవరు నాకు చెప్పడానికి అంటూ విశ్రాంత తహసీల్దార్‌పై దాడి చేసి కొట్టాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
వ్యక్తి బలవన్మరణం
తవణంపల్లె: అప్పుల భారం అధికం కావడంతో భార్యతో గొడవపడి ఇంట్లో పురుగులు మందు తాగి ఓ వ్యక్తి ఆత్యహత్య చేసుకున్నాడని తవణంపల్లె ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు.. మండలంలోని అరగొండకు చెందిన డి.సుఽధీర్‌కుమార్(31) తిరుపతిలో డ్రైవింగ్ చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. తిరుపతిలో అప్పుల బాధ తట్టుకోలేక భార్యపిల్లలతో వచ్చి అరగొండలో నివాసం ఉంటున్నారు. అప్పులు కట్టకుండా పనులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండడంతో భార్యభర్తలు గొడవపడ్డారు. దీంతో జీవితంపై విరక్తి చెంది శనివారం ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి డి.కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు.
17 మందికి జరిమానా
చిత్తూరు అర్బన్: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 17 మందికి రూ.44 వేల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్స్‌పల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమాదేవి శనివారం తీర్పునిచ్చారు. చిత్తూరు టూటౌన్ పోలీసులు రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 17 మందిని గుర్తించి, వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించగా.. జరిమానా విధించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ముగ్గురికి ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున రూ.30 వేలు జరిమానా విధించినట్లు సీఐ నెట్టికంటయ్య తెలిపారు.