
ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోండి
చిత్తూరు కలెక్టరేట్ : ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని ఆర్డీఓ శ్రీనివాసులు అన్నారు. శనివారం ఆర్డీఓ కార్యాలయంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల్లో శాంతిభద్రతలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. వినాయక విగ్రహాలు నిమజ్జనం కట్టమంచి చెరువులో మాత్రమే చేయాలన్నారు. చెరువు వద్ద సరిపడే బారికేడ్లు, ఫోకస్ లైట్‌లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. తాగునీరు సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. పెద్ద క్రేన్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డీఎస్పీ సాయినాథ్ మాట్లాడుతూ గత సంవత్సరం వినాయకుని ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయన్నారు. అలాగే ఈసారి చిన్న సంఘటనలు చోటు చేసుకోకుండా ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. నిమజ్జనం మార్గంలో కరెంట్ వైర్‌లు, కేబుల్ వైర్‌లు అడ్డు రాకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వినాయకుని విగ్రహాలను నిమజ్జనం చేసే మూడు, ఐదు, తొమ్మిది, పదకొండో రోజుల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ సమావేశంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రామభద్ర, హరి, జయచంద్ర, వెంకటేష్, సీఐలు మహేశ్వర్, నెట్టికంఠయ్య, అడిషనల్ ఫైర్ ఆఫీసర్ కరుణాకరన్, అడిషనల్ డీఎంహెచ్‌ఓ వెంకటప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.