
న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం
చిత్తూరు కలెక్టరేట్ : తన భూ సమస్యకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని జిల్లాలోని ఐరాల మండలం, పందికొట్టూరు గ్రామానికి చెందిన భూ బాధితుడు నాగభూషణం నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన భూ సమస్య పరిష్కారం కోసం ఆయన శుక్రవారం చిత్తూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సీఎం చంద్రబాబునాయుడు ఫొటోతో కూడిన బ్యానర్‌ను చేతబట్టి గంటల తరబడి మండుటెండలో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఐరాల మండలం, పందికొట్టూరు గ్రామంలో సర్వే నం.1527/1 లో 4.02 ఎకరాల భూమి ఉందన్నారు. ఆ భూమిలో తనకు రెండు ఎకరాలు చెందుతుందన్నారు. ఆ రెండు ఎకరాల భూమి తన పూర్వీకుల నుంచి తమ అనుభవంలో ఉన్నట్లు తెలిపారు. అయితే మొత్తం భూమిని తమ బంధువులు ఆక్రమించారని చెప్పారు. న్యాయం కోసం పలుమార్లు అధికారుల వద్దకు తిరుగుతున్నప్పటికీ ఎలాంటి స్పందనా లేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుకు సైతం అర్జీ ఇచ్చానని తెలిపారు. అయినప్పటికీ క్షేత్రస్థాయి అధికారులు పట్టించుకోలేదన్నారు. కలెక్టర్ ఆదేశించినప్పటికీ చిత్తూరు ఆర్డీవో కార్యాలయం సర్వే అధికారులు న్యాయం చేయలేదన్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చి మోసం చేస్తున్నట్లు ఆరోపించారు. న్యాయం చేయకపోతే సీఎం కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని కన్నీటిపర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుని వద్దకు వచ్చి ధర్నా విరమింపజేశారు. అనంతరం సర్వే అధికారుల వద్దకు తీసుకెళ్లి ఆయన సమస్య పరిష్కారానికి చేపట్టాల్సిన అంశాలను చర్చించారు. దీంతో భూ బాధితుడు తాత్కాలికంగా ధర్నా విరమించారు.

న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం