
యువకుడికి తీవ్ర గాయాలు
గంగవరం: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలో శుక్రువారం చోటుచేసుకుంది. వివరాలు.. పెద్దపంజాణి మండలం, పట్టగాణిపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ కుమారుడు మంజు(17) ద్విచక్ర వాహనంలో కల్లుపల్లి గ్రామానికి వచ్చాడు. అక్కడి నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా పుంగునూరు నుంచి పలమనేరు వైపు వెళ్తున్న స్కార్పియో కారు కల్లుపల్లి చెక్‌పోస్టుకు సమీపంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడి తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడ్ని చికిత్స నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమించడంతో వేలూరు సీఎంసీకి రెఫర్ చేశారు. ప్రమాదంలో కారు ముందు భాగం, ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారుని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
విద్యార్థులకు
వ్యాస రచన పోటీలు
చిత్తూరు కలెక్టరేట్ : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతవర్ష జయంతి వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు సత్యసాయి సేవా సంస్థల సంఘం జిల్లా అధ్యక్షుడు మధుసూదనం తెలిపారు. ఆయన శుక్రవారం ఆ సంఘ నాయకులతో కలిసి డీఐఈవో రఘుపతి, డీఈవో వరలక్ష్మిని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సెప్టెంబర్‌లో పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో చదివే విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహిస్తామన్నారు. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కర్తవ్యమే దైవం (తెలుగు మీడియం), డ్యూటీ ఈస్ గాడ్ (ఇంగ్లిష్ మీడియం), జూనియర్ కళాశాల విద్యార్థులకు రేపటి భవిష్యత్ నేడు మన చేతిలోనే ఉంది (తెలుగు మీడియం), ది ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ వాట్ వ్యూ డు అట్ ప్రెసెంట్ (ఇంగ్లిష్ మీడియం)లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామన్నారు. డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ప్రపంచంలో పరివర్తన మార్పు రావాలంటే, ముందు నీలో మార్పు రావాలి (తెలుగు మీడియం), టాన్స్‌ఫార్‌మ్స్ యువర్ సెల్ఫ్ టూ టాన్స్‌ఫార్మ్ ది వరల్డ్ (ఇంగ్లిష్ మీడియం) వ్యాసరచన పోటీలుంటాయన్నారు. ఈ పోటీల నిర్వహణ తేదీలు త్వరలో వెల్లడిస్తామన్నారు. ఇతర వివరాలకు 9440690137లో సంప్రదించాలని ఆయన కోరారు. సభ్యులు శంకర్, గజేంద్రరెడ్డి, శేషనారాయణ, కృష్ణమనాయుడు తదితరులు పాల్గొన్నారు.