
నేడు విద్యుత్ గ్రీవెన్స్
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం బుధవారం విద్యుత్ గ్రీవెన్స్ నిర్వహించనున్నారు. స్థానిక గాంధీ రోడ్డులోని ట్రాన్స్‌కో అర్బన్ ఈఈ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు గ్రీవెన్స్ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఈఈ మునిచంద్ర తెలిపారు. చిత్తూరు, పూతలపట్టు వినియోగదారులు సమస్యలను రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.
దరఖాస్తుల ఆహ్వానం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఎంపీహెచ్‌డబ్ల్యూ ఉచిత కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌చార్జ్ డీఎంఅండ్‌హెచ్‌ఓ వెంకటప్రసాద్ తెలిపారు. ఈ కోర్సు శిక్షణ కాలం రెండేళ్ల పాటు ఉంటుందన్నారు. చిత్తూరులోని జిల్లా ప్రభ్తుత్వాస్పత్రి, తిరుపతి రుయా, తిరుపతిలోని రాస్, చిత్తూరులోని శ్రీనివాస, పుత్తూరులోని సెయింట్మేరిస్, లక్ష్మీనారాయణ శిక్షణ కేంద్రాల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సుకు శిక్షణ ఇస్తారన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను శిక్షణ కేంద్రానికి లేదా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై, 17 ఏళ్లు పూర్తై ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు సడలింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
కలెక్టర్ ఆదేశించినా చర్యలేవీ?
చిత్తూరు రూరల్ (కాణిపాకం): అక్రమ స్కానింగ్ విషయంలో ఓ ఆశ వర్కర్‌ను తొలగించాలని కలెక్టర్ ఆదేశించినా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బేఖాతార్ చేస్తున్నారు. మేలో చిత్తూరు నగరంలోని భరత్‌నగర్‌లో అక్రమ స్కానింగ్ సెంటర్‌ను కలెక్టర్ సుమిత్‌కుమార్ రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. ఈ వ్యవహరంలో 20 మందిపైగా కేసు నమోదైంది. ఇందులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేసే సిబ్బంది హస్తం ఉందని తేలింది. కానీ ఆ సిబ్బందిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నారు. పోలీసుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ వెంటనే సిబ్బంది(ఆశ వర్కర్)ను తొలగించాలని ఆదేశించారు. దీంతో హడవిడి చేసిన ఆ శాఖ అధికారులు తొలగింపు చర్యను నొక్కిపెట్టేశారు. ప్రభుత్వ విధుల్లో పనిచేస్తూ..కేసు నమోదైతే నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలనే నిబంధన ఉన్నా.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ అక్రమ స్కానింగ్ విషయంలో ఆ శాఖలోని అధికారులతో ఏమైనా సంబంధాలున్నాయా... అందుకే ఈ విషయంలో మౌనం పాటిస్తున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏనుగులున్నాయ్ జాగ్రత్త
పులిచెర్ల(కల్లూరు): కల్లూరు, పదిపుట్ల బైలు రిజర్వు ఫారెస్టులో ఒంటరి ఏనుగు సంచరిస్తోందని, రైతులు సమీప పొలాల్లోకి వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు సూచించారు. రాత్రి పూట పొలాలవద్దకు వెళ్లరాదని, అలాగే తెల్లటి దుస్తులు ధరించరాదని పేర్కొన్నారు. ఏనుగులు కనిపిస్తే తరమడం, అదిలించడం లాంటివి చేయరాదని, వెంటనే 9550067503 నంబర్‌కి ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.
టీకాలు విధిగా వేయించాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పిల్లలకు రొటీన్ టీకాలు విధిగా వేయించాలని ఇన్‌చార్జ్ డీఎంఅండ్‌హెచ్‌ఓ వెంకటప్రసాద్ పేర్కొన్నారు. చిత్తూరులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం వ్యాధి నిరోధక టీకాలపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రాణాంతక వ్యాధులు చంటి బిడ్డలకు రాకుండా ముందే వ్యాధి నిరోధక టీకాలు వేయించాలన్నారు. 0–5 లోపు పిల్లలకు టీకాలు వేయించే విషయంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. విధిగా పల్లెల్లోని పిల్లలకు టీకాలు వేయించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. అనంతరం డబ్ల్యూహెచ్‌ఓ కన్సల్టెంట్ మౌనిక స్టెపి తామస్ వైద్యాధికారులకు శిక్షణ ఇచ్చారు.
నేడు హుండీ లెక్కింపు
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన హుండీ లెక్కింపు బుధవారం జరగనున్నట్లు ఈవో పెంచలకిషోర్ తెలిపారు. ఉదయం 7 గంటలకు ఆస్థాన మండపంలో లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది విధిగా హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు.

నేడు విద్యుత్ గ్రీవెన్స్