గంజాయి స్వాధీనం
గుడిపాల : గంజాయి స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్ట్ చేసినట్లు గుడిపాల ఎస్‌ఐ రామ్మోహన్ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలు ఇలా.. ఒడిసా రాష్ట్రం, బద్రాక్ జిల్లాకు చెందిన అశోక్‌దాస్ అనే అతను గంజాయి తీసుకొని గొల్లమడుగు చెక్‌పోస్ట్ సమీపంలో ఉన్నాడని సమాచారం అందిందన్నారు. వెంటనే గుడిపాల తహసీల్దార్ జయంతికి సమాచారం అందించామన్నారు. సంఘటనా స్ధలానికి తహసీల్దార్‌తో పాటు పోలీసులు వెళ్లి అరెస్ట్ చేసి విచారించగా గాజులపల్లెలోని సాంబా గ్రానైట్ ఫ్యాక్టరీలో ఆరు నెలల నుంచి పనిచేస్తున్నట్లు తెలిపాడు.
తన గ్రామానికి వెళ్లి వచ్చేటప్పుడు బద్రాక్ జిల్లాలో గంజాయిని ఒక కిలో రూ.3 వేలకు కొని ఇక్కడ రూ.20 నుంచి 30 వేల రూపాయలకు అమ్ముతున్నట్లు చెప్పాడన్నారు. అతడి వద్ద నుంచి సుమారు 1.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. ఆర్‌ఐ రమాసాయి, వీఆర్‌ఓ నాగరాజు, పోలీసులు పాల్గొన్నారు.
తగ్గిన పాల ధరలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో వర్షాల కారణంగా పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఫలితంగా పాల ధరలు పడిపోయాయి. లీటర్‌పై రూ.2 నుంచి రూ.3 వరకు తగ్గుముఖం పట్టింది. దీంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ధరలు పతనమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.
నేడు లీటరు రూ.33
ఏప్రిల్‌కు ముందు రోజు వారీగా 12 లక్షల నుంచి 15 లక్షల లీటర్ల పాల సేకరణ జరిగేది...ప్రస్తుతం 19 లక్షల లీటర్లకు పుంజుకుంది. ఇలా పాల ఉత్పత్తి పెరగడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాల ధరలు పడిపోయాయి. ఏప్రిల్‌లో పాల మధ్యస్థ ధర లీటర్ రూ.35.50 ఉండగా నేడు రూ.33కు పడిపోయింది.
● ప్రస్తుతం డెయిరీల నుంచి డీలర్లకు విక్రయించే పాల ప్యాకెట్ లీటర్ ధర రూ.65.40 ఉంది. డీలర్లు ప్రజలకు అమ్మే ఎమ్మార్పీ ధర రూ.72 నుంచి రూ.74 ఉంది. అయితే ధరలు తగ్గుముఖం పడితే ఆ ధరలను తగ్గించకుండా డెయిరీలు పాడి రైతులు, ప్రజలను మోసం చేస్తున్నాయి.


