క్రిస్మస్ వేడుకల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
గుడిపాల: ముందస్తుగా జరుపుకున్న క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. గుడిపాల మండలం, అరుల్‌పురం గ్రామంలో సోమవారం ముందస్తు క్రిస్‌మస్ వేడుకలు నిర్వహించారు. నేషనల్ క్రిస్టియన్ బోర్డు తమిళనాడు అధ్యక్షుడు జాషువా అధ్యక్షతన పాస్టర్లు ఆధ్వర్యంలో క్రిస్‌మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న రామచంద్రారెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ సందర్భంగా పేదలందరికీ దుస్తులు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే పేదలందరికీ గుర్తింపు వచ్చిందన్నారు. మాటచెప్తే మడపతిప్పని నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు చేశారు..? మీరే గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ఏది దొరికితే అవి దోచుకొనే పరిస్థితుల్లో ఉన్నారని విమర్శించారు. రాబోయే కాలంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. అనంతరం నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మాట్లాడుతూ టీడీపీ సూపర్‌సిక్స్ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టిందన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని తిప్పి కొట్టాలన్నారు. అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కేక్ కట్‌చేసి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేషనల్ క్రిస్టియన్ బోర్డు ప్రెసిడెంట్ జాన్‌మార్క్, నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ ప్రెసిడెంట్ రమేష్‌ప్రసాద్, బిషప్ ధనరాజ్, కార్పొరేటర్ మధురెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.


