సమస్యలు పరిష్కరించండి సారూ!
చిత్తూరు కలెక్టరేట్ : ‘సారూ...మీరే మాకు న్యాయం చేయాలి’ అంటూ అర్జీదారులు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు క్యూ కట్టారు. ఎన్ని సార్లు తిరుగుతున్నా క్షేత్ర స్థాయిలో న్యాయం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ మాట్లాడుతూ ప్రజలు అందజేసే అర్జీలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పీజీఆర్‌ఎస్‌లో వివిధ సమస్యలపై 353 అర్జీలు నమోదైనట్లు కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ వెల్లడించారు. ట్రైనీ కలెక్టర్ నరేంద్రపడాల్, డీఆర్‌వో మోహన్‌కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.


