దళితుడని.. శవాన్ని పోనిచ్చేది లేదని!
శ్మశాన వాటికకు వెళ్లనివ్వకుండా అడ్డగింత ప్రశ్నించిన దళితులపై పైశాచిక దాడి బాధిత దళితులపైనే కేసులు నమోదు చేసిన పోలీసులు!
గంగవరం: దళిత కులస్తుడి మృతదేహాన్ని శ్మశాన వాటికకు పోనీయకుండా టీడీపీకి చెందిన అగ్రకులస్తుడు అడ్డగించిన ఘటన మండలంలో సోమవారం వెలుగు చూసింది. బాధితుల వివరాల మేరకు.. మండలంలోని పసుపత్తూరు పంచాయతీ, వీరశెట్టిపల్లి గ్రామంలో దళిత కులానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యతో మృతి చెందాడు. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం కోసం కుటుంబీకులు, బంధువులు కలిసి గ్రామ సమీపంలోని శ్మశానవాటికకు తీసుకెళ్తుండగా పసుపత్తూరు గ్రామానికి చెందిన టీడీపీ అగ్ర కులస్తులు శ్రీనివాసులు, అతని కొడుకు సుబ్బు ఇద్దురూ కలిసి అడ్డుకున్నారు. తమ పశువుల షెడ్డు ఆనుకుని ఉన్న దారిలో పోనివ్వడం కుదరదని బెదిరించారు. తాతల కాలం నుంచి ఈ దారిలోనే శ్మశానానికి, గంగమ్మ ఆలయానికి వెళ్తున్నామని, ఇప్పుడు ఎందుకు వెళ్లనివ్వరో చెప్పాలంటూ దళితులు ప్రశ్నించారు. అప్పటి సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు ఈ దారి తమ అధీనంలో ఉందని, శవాన్ని పోనిచ్చే ప్రసక్తే లేదంటూ భీష్మించుకున్నారు. ప్రశ్నించిన దళితులపై పైశాచిక దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో గణేష్ అనే వ్యక్తితో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. బాధితుల ఫిర్యాదును స్వీకరించకపోగా తిరిగి వారిపైనే కేసులు నమోదు చేసినట్టు వాపోయారు. దళితులకు ఇంత అన్యాయం జరుగుతుంటే అధికార పార్టీ నేతలు శవ రాజకీయాలు చేసి తమకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. దీనిపై జిల్లా అధికారులను ఆశ్రయిస్తామని వారు తెలిపారు.


