బీమా సొమ్ము కాజేసింది!
విజయపురం: బాధితుల ఇన్సూరెన్స్ డబ్బును సంఘమిత్ర కాజేసిన ఘటన పన్నూరు గ్రామంలో చోటుచేసుకొంది. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పన్నూరు గ్రామానికి చెందిన ఇంద్రాణమ్మ ఆనందవల్లి గ్రూపులో సభ్యురాలు. ఆమెకు 60 ఏళ్లు పైబడడంతో ఏడాది క్రితం గ్రూపు నుంచి పేరు తొలగించారు. ఆ తర్వాత ఆమె మృతి చెందింది. ఆమె మృతితో ప్రభుత్వం నుంచి రూ.1.3 లక్షలు ఇన్సూరెన్స్ డబ్బు చెక్కు రూపంలో మంజూరు చేశారు. ఆ చెక్‌ను మృతురాలి భర్త గోవిందస్వామి సంఘమిత్రకు అందజేశాడు. అయితే చెక్కు తీసుకున్న సంఘమిత్ర ఇంతవరకు డబ్బు చెల్లించలేదని మృతురాలి భర్త వాపోయాడు. తన భార్యకు వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బును ఇప్పించాలని గత ఏడాదిగా వెలుగు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదని వాపోయాడు. జిల్లాఽ అధికారులు తనకు న్యాయం చేయాలని కోరాడు.
అదృశ్యమై..శవమయ్యాడు!
ఐరాల: మండలంలోని గుట్టకిందపల్లె దళితవాడలో ఆరు రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించాడు. పోలీసులు కథనం.. గుట్టకిందపల్లె దళితవాడకు చెందిన లక్ష్మయ్య(40) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య శోభారాణితో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈనెల 16న ఇంటి నుంచి బయటకు వెళ్లిన లక్ష్మయ్య తిరిగి ఇంటికి చేరుకోలేదు. భార్య శోభారాణి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, అదృశ్యమైనట్టు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సోమవారం ఉదయం వీఎస్.అగ్రహారం చెరువుకట్ట పక్కన కంప చెట్లల్లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లక్ష్మయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రేషన్ బియ్యం స్వాధీనం
కార్వేటినగరం: అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న ఘటన మండల కేంద్రంలోని శివాలయం వీధిలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ తేజశ్వని కథనం.. కార్వేటినగరం శివాలయం వీధికి చెందిన ఆనంద్‌శెట్టి కుమారుడు ఎ.బాలాజీ తమ పాత ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్టు వీఆర్వో మోహన్‌కు సమాచారం అందింది. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. గతంలో కూడా తమిళనాడు నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయించడంతో అతనిపై కేసు ఉంది. అతని వద్ద ఉన్న 45 కేజీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
మద్యం బాటిళ్ల సీజ్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇంట్లోనే మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని బీఎన్‌ఆర్‌పేట పోలీసులు సోమవారం రాత్రి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చిత్తూరు మండలం నల్లవెంకటయ్యగారిపల్లిలో బెల్టుషాపు నిర్వహిస్తున్నారని బీఎన్‌ఆర్‌పేట పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీంతో ఓ వ్యక్తి ఇంట్లో 25 మద్యం బాటిళ్లు పట్టుబడినట్టు ఎస్‌ఐ మణికంఠేశ్వరెడ్డి తెలిపారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
కార్వేటినగరం: పేకాట రాయళ్లను అరెస్టు చేసిన ఘటన మండల పరిధిలోని ఈదువారిపల్లి గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్‌ఐ తేజశ్విని కథనం.. ఈదువారిపల్లి గ్రామానికి సమీపంలో పేకాట ఆడుతున్నట్లు అందిన రహస్య సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.2,820 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. దాడుల్లో సిబ్బంది రాజశేఖర్, ఎస్‌బీఐ సిబ్బంది బాగ్యరాజ్, లోకనాథం, యువరాజు, మోహన్ ఉన్నారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 76,903 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,612 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.64 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 08 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
బీమా సొమ్ము కాజేసింది!
బీమా సొమ్ము కాజేసింది!


