పేదల ఆశాజ్యోతి జగన్
శ్రీరంగరాజపురం: పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అని మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి కొనియాడారు. సోమవారం ఆయన స్థానిక నాయకులను పరామర్శించి.. మీడియాతో మాట్లాడారు. జగనన్న జన్మదిన వేడుకలు గ్రామాలలో పండుగ వాతావరణంలో జరిగాయన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా జగనన్న అభిమానులు వైభవంగా నిర్వహించడం శుభ సూచకమన్నారు. 2029లో జగనన్న ముఖ్యమంత్రి చేయడమే ప్రజలందరి లక్ష్యమన్నారు. జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో ఆరు మండలాల నాయకుల సహకారంతో జగనన్న జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయన్నారు.
పోలీసు గ్రీవెన్స్‌కు 50 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: చిత్తూరులో నిర్వహించిన పోలీసు ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో 50 వినతులు అందాయి. చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఎస్పీ తుషార్ డూడీ ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతి ఫిర్యాదునూ ఆన్‌లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌస్ అధికారులతో మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చే ప్రతీ ఒక్క సమస్యపై విచారణ చేపట్టి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.
‘కరెంటోళ్ల జనబాట’కు శ్రీకారం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ తెలిపారు. ఈ మేరకు నూతనంగా ప్రారంభించిన కార్యక్రమం అప్లికేషన్‌ను కలెక్టర్ సోమవారం కలెక్టరేట్‌లో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల విద్యుత్ సమస్యలను నేరుగా గుర్తించి వేగంగా పరిష్కరించేందుకు కరెంటోళ్ల జనబాటను ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది ప్రతి మంగళ, శుక్రవారాలు నిర్ధేశిత గ్రామాలు, వార్డుల్లో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారన్నారు. విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్, ఈఈ మునిచంద్ర, పీవో రెడ్డెప్ప పాల్గొన్నారు.
రెండో రోజు 8,911మందికి చుక్కల మందు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో సోమవారం కూడా పోలియో చుక్కల కార్యక్రమం కొనసాగింది. రెండో రోజు వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 8,911 మంది పిల్లలకు చుక్కల మందు వేశారు. కాగా రెండు రోజులుగా 2,07,438 మందికి పోలీయో చుక్కలు వేసినట్టు డీఐఓ హనుమంతరావు తెలిపారు.
జెడ్పీలో కారుణ్య నియమాకాలు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా పరిషత్ పరిధిలో 11 మందికి కారుణ్య నియమాకాలు చేపట్టారు. సోమవారం జెడ్పీ కార్యాలయంలో చైర్మన్ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్‌నాయుడు నియమాక పత్రాలను అభ్యర్థులకు అందజేశారు. వీటితోపాటు రికార్డు అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 9 మంది ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించారు. బాధ్యతయుతంగా పని చేయాలని ఉద్యోగులకు సూచించారు.
పేదల ఆశాజ్యోతి జగన్
పేదల ఆశాజ్యోతి జగన్
పేదల ఆశాజ్యోతి జగన్


